
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) బద్దలు కొట్టాడు. అత్యధికసార్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ICC Player Of The Month)’ అవార్డును గెలిచిన ఆటగాడిగా కొనసాగుతున్న బాబర్‌ను వెనక్కినెట్టి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.
కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రతీ నెలా ప్రకటించే ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ జూలై నెలకు గానూ గిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన అతడిని జూలై నెల అవార్డుకు అర్హుడిగా మార్చింది.
754 పరుగులు
ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో మొత్తం 754 పరుగులు చేసిన గిల్... అవార్డుకు పరిగణనలోకి తీసుకున్న జూలై నెలలో 3 టెస్టుల్లో కలిపి 567 పరుగులు సాధించాడు. ఇందులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో చేసిన 269, 161 (మొత్తం 430) పరుగుల ప్రదర్శన గిల్ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది.
ఐసీసీ అవార్డుకు ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసిన గిల్... ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తాను ఆడిన 269 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ తనకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించాడు.
ఎప్పటికీ మర్చిపోలేనిది
‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. కెప్టెన్‌గా తొలి టెస్టు సిరీస్‌లో ప్రదర్శనకుగాను నాకు గుర్తింపు దక్కడం దీనిని మరింత ప్రత్యేకంగా మార్చింది. బర్మింగ్‌హామ్‌లో చేసిన డబుల్ సెంచరీ ఎంతో ప్రత్యేకమైంది. ఎప్పటికీ మర్చిపోలేనిది.
ఇంగ్లండ్‌తో సిరీస్ కెప్టెన్‌గా నేను ఎంతో నేర్చుకునే అవకాశం కల్పించింది. ఇరు జట్లు చాలా బాగా ఆడాయి. ఆటగాళ్లందరికీ కూడా ఇది చిరస్మరణీయం. మున్ముందు ఇదే తరహా ప్రదర్శనను కొనసాగిస్తాను’ అని గిల్ స్పందించాడు.
ఇదిలా ఉంటే.. ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు పొందడం గిల్‌కిది నాలుగోసారి. 2023 జనవరిలో, సెప్టెంబర్‌లో... 2025 జనవరిలో, జూలైలో గిల్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే అత్యధికసార్లు ఈ అవార్డు నెగ్గిన మేల్ క్రికెటర్‌గా.. అదే విధంగా.. ఒకే ఏడాదిలో రెండుసార్లు అవార్డు గెలిచిన తొలి ప్లేయర్‌గా గిల్ నిలిచాడు.
అత్యధికసార్లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన పురుష క్రికెటర్లు వీరే
1. శుబ్‌మన్ గిల్- ఇండియా- నాలుగుసార్లు విజేత
2. బాబర్ ఆజం- పాకిస్తాన్- మూడుసార్లు విజేత
3. శ్రేయస్ అయ్యర్- ఇండియా- రెండుసార్లు విజేత
4. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- రెండుసార్లు విజేత
5. హ్యారీ బ్రూక్- ఇంగ్లండ్- రెండుసార్లు విజేత
6. కమిందు మెండిస్- శ్రీలంక- రెండుసార్లు విజేత
7. జస్‌ప్రీత్ బుమ్రా- ఇండియా- రెండుసార్లు విజేత
8. ముహమ్మద్ వసీం- యూఏఈ- రెండుసార్లు విజేత.