శ్రేయస్‌ అయ్యర్‌ ఇరగదీశాడు.. 199 పరుగులు..! | Shreyas Iyer Scored 199 In A Practice Match To Prove His Fitness: Reports - Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ అయ్యర్‌ ఇరగదీశాడు.. డబుల్‌ సెంచరీకి ఒక్క పరుగు తక్కువ..!

Aug 24 2023 4:22 PM | Updated on Aug 24 2023 4:29 PM

Shreyas Iyer Scored 199 In A Practice Match To Prove His Fitness Says Reports - Sakshi

త్వరలో జరుగనున్న ఆసియా కప్‌-2023 కోసం భారత సెలెక్టర్లు స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వెన్ను గాయం కారణంగా చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్న అయ్యర్‌ ఇటీవలే నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ను ప్రూవ్‌ చేసుకుని టీమిండియాకు ఎంపికయ్యాడు. అయ్యర్‌ ఎంపిక, అతని ఫిట్‌నెస్‌పై పలువురు మాజీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి చెందిన ఓ కీలక అధికారి ఈ అంశాలపై వివరణ ఇచ్చాడు.

అయ్యర్‌తో పాటు గాయం నుంచి కోలుకుని ఆసియాకప్‌కు ఎంపికైన కేఎల్‌ రాహుల్‌ కూడా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని స్పష్టం చేశాడు. ప్రోటోకాల్‌ ప్రకారం బెంగళూరులోని ఎన్‌సీఏలో జరిగిన ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇరువురు చాలా చరుగ్గా కనిపించారని, వారిద్దరిలో మునుపటి కంటే అధికమైన ఉత్సాహం కనిపించిందని తెలిపాడు. ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌ 150కిపైగా బంతులను ఎదుర్కొని 199 పరుగులు చేశాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా అయ్యర్‌ 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ కూడా చేశాడని వెల్లడించాడు.

ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు ఓ ఆటగాడు ఇంతకంటే ఏం చేయాలని ప్రశ్నించాడు. అయ్యర్‌తో పాటు రాహుల్‌ కూడా 100 శాతం ఫిట్‌నెస్‌ సాధించారని, ఎన్‌సీఏలో వారిద్దరూ గత రెండునెలలుగా కఠోరంగా శ్రమించారని తెలిపాడు. రాహుల్‌, అ‍య్యర్‌లు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకుండానే సెలెక్టర్లు హడావుడిగా వారిని ఆసియాకప్‌కు ఎంపిక చేశారన్నది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు.

ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ ప్రామాణికాలు చాలా కఠినంగా ఉంటాయని, ఇక్కడ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేయడమంటే ఆషామాషీ విషయం కాదని తెలిపాడు. ఇకనైనా రాహుల్‌, అయ్యర్‌ల ఎంపికపై అనవసర రాద్దాంతాలు మానాలని, వారివురు పూర్తి ఫిట్‌గా ఉన్నందుకే వారి ఎంపిక జరిగిందని స్పష్టం చేశాడు.

కాగా, వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల ఎంపిక హడావుడిగా జరిగిందని పలువురు మాజీలతో పాటు కొందరు నెటిజన్లు సైతం అనుమానిస్తున్నారు. అయితే, తాజాగా ఎన్‌సీఏ అధికారి వివరణతో అంతా మిన్నకుండిపోయారు. 

ఇదిలా ఉంటే, ఈనెల 30వ తేదీ నుంచి ఆసియా కప్‌-2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 6 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌, నేపాల్‌ జట్లు తలపడనున్నాయి. పాకిస్తాన్‌, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సెప్టెంబర్‌ 2న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరుగనుంది. లంకలోని పల్లెకెలె స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్‌ 4న నేపాల్‌.. ఇదే మైదానంలో టీమిండియాను ఢీకొంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement