భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. శ్రేయస్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా నెల రోజులైనా పడుతుందని డాక్టర్లు అంటున్నారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్‌లో శ్రేయస్ ఆడటం కష్టమేనని తెలుస్తుంది. బీసీసీఐ శ్రేయస్ విషయంలో ఎలాంటి తొందరపాటుకు పోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పూర్తిగా కోలుకొని, ప్రాక్టీస్ మొదలుపెట్టాకే అతనికి కబురు పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్‌లో శ్రేయస్‌కు ప్రత్యామ్నాయం కోసం సెలెక్టర్లు వేట మొదలుపెట్టారు. గత కొంతకాలంగా శ్రేయస్ నాలుగో స్థానంలో అంచనాలకు మించి రాణిస్తూ, స్థిరపడ్డాడు. ఈ సిరీస్‌కు శ్రేయస్ దూరమైతే టీమిండియా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లవతుంది.
ఇటీవలికాలంలో ఛేదనల్లో శ్రేయస్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడకముందు కూడా రాణించాడు. మొత్తంగా శ్రేయస్ గాయం భారత వన్డే జట్టు కూర్పును గందరగోళంలో పడేసింది.
ఇదిలా ఉంటే, శ్రేయస్ గాయానికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాయపడిన వెంటనే శ్రేయస్ ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు నివేదికలు తెలిపాయి. స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ అక్సిజన్ లెవెల్స్ 50కి పడిపోయినట్లు పేర్కొన్నాయి.
ఆ సమయంలో శ్రేయస్ పది నిమిషాల పాటు నిలబడలేకపోయాడని, అతడి శరీరం పూర్తిగా బ్లాక్ అవుటయ్యిందని తెలిపాయి. ఈ విషయం వింటుంటే శ్రేయస్ చావుకు దగ్గరగా వెళ్లొచ్చాడని స్పష్టమవుతుంది.
అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టుకోగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.
అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు. ఈ విషయం తెలిశాక యావత్ క్రికెట్ సమాజం ఆందోళనకు గురైంది.
శ్రేయస్‌కు ఏమీ కాకూడదని దేవుళ్లను మొక్కింది. దేవుడి దయ, డాక్టర్ల పనితనం వల్ల శ్రేయస్ మృత్యు కొరల్లో నుంచి బయటపడ్డాడు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్


