చిక్కుల్లో పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ | Shashank Singh Faces Criminal Offence Charges, IPL Career In Jeopardy | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌

Jun 30 2026 11:57 AM | Updated on Jun 30 2026 12:32 PM

Shashank Singh Faces Criminal Offence Charges, IPL Career In Jeopardy

పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శశాంక్‌ సింగ్‌, అతడి తండ్రి శైలేష్ సింగ్‌పై భోపాల్‌ నగరంలో క్రిమినల్ కేసు నమోదైంది. ఇంట్లో వంటమనిషే వారిపై కేసు పెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన విపేంద్ర సింగ్ తోమర్‌ను శైలేష్ ఇంట్లో వంటమనిషిగా కుదిర్చారు.

నెలకు రూ.15 వేల జీతంతో పాటు వసతి, భోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన శైలేష్ తన పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే పని ప్రారంభించిన కొద్ది రోజులకే శశాంక్‌, శైలేష్ తన వంటపై ఫిర్యాదు చేస్తూ, తరచూ దుర్భాషలాడేవారని విపేంద్ర ఆరోపించాడు. దీంతో పని మానేసి స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఆ సమయంలో శశాంక్, అతడి తండ్రి తనపై దాడి చేశారని, ఇంట్లోనే బంధించి బలవంతంగా పని చేయించారని విపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో శైలేష్‌ డ్రైవర్ కూడా పాల్గొన్నట్లు ఆరోపించాడు. తన మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కున్నారని పేర్కొన్నాడు.

ఫిర్యాదు అనంతరం పోలీసులు బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ముఖం మరియు శరీరంపై గాయాల ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ప్రాథమిక ఆధారాల ఆధారంగా శశాంక్ సింగ్, శైలేష్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు.

పోలీసులు బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్య ప్రవర్తన, దుర్భాషలాడడం, ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, ఒకే ఉద్దేశంతో పలువురు కలిసి నేరానికి పాల్పడడం వంటి ఆరోపణలను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఇక క్రికెట్ పరంగా చూస్తే, శశాంక్ సింగ్‌కు 2026 ఐపీఎల్ సీజన్ నిరాశాజనకంగా సాగింది. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో అతడు కేవలం 132 పరుగులు మాత్రమే చేయడంతో పాటు ఫీల్డింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదవడం అతని ఐపీఎల్‌ భవిష్యత్‌పై అనిశ్చితిని పెంచింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement