నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే వన్డే ప్రపంచకప్ (ICC Women's ODI World Cup) విజేతగా నిలిచింది. సొంతగడ్డపై ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు మొదలు అభిమానుల దాకా.. యావత్ భారతావని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.
భారీ నజరానా
ఢిల్లీ నుంచి గల్లీ దాకా హర్మన్ సేన గెలుపును ప్రస్తావిస్తూ మన ఆడబిడ్డలను ఆకాశానికెత్తింది. ఇక వరల్డ్‌కప్ గెలిచిన జట్టులోని సభ్యులైన క్రికెటర్లకు ఐసీసీ అందించే రూ. 40 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన రూ. 51 కోట్ల నజరానా దక్కనుంది.
క్యాష్ రివార్డులు
అంతేకాదు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ ఎత్తున రివార్డులు ప్రకటించాయి. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్‌లకు ఇప్పటికే ప్రభుత్వం తలా రూ.2.25 కోట్ల మేర చెక్కులు అందించింది.
భారత జట్టులోని ఇతర సభ్యులు క్రాంతి గౌడ్ (మధ్యప్రదేశ్), అమన్‌జోత్ కౌర్, హర్లీన్ డియోల్ (పంజాబ్), రిచా ఘోష్ (బెంగాల్), అరుంధతి రెడ్డి (తెలంగాణ)లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగంతో పాటు.. రూ. 2.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. సొంత ఊరిలో ఇంటి స్థలం కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ విజేతలను ఉద్దేశించి టీమిండియా దిగ్గజ0, 1983 వరల్డ్‌కప్ విన్నర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
అమ్మాయిలు జాగ్రత్త
మిడ్-డేకు రాసిన కాలమ్‌లో.. ‘‘అమ్మాయిలు కాస్త జాగ్రత్త. మీకోసమే ఈ మాటలు.. అందరూ మాట ఇచ్చినట్లుగా మీకు అవార్డులు, రివార్డులు దక్కకపోతే అస్సలు బాధపడొద్దు. మన దేశంలో అడ్వర్టైజర్లు, బ్రాండ్లు, కొంతమంది వ్యక్తులు ఉచిత ప్రచారం కోసం విజేతలను తమ భుజాలపై మోస్తారు.
జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్‌పేజీ యాడ్లు, హోర్డింగ్‌లు పెట్టిస్తారు. జట్టు యాజమాన్యం, స్పాన్సర్లు తప్ప మిగతా వారంతా ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తారు. నిజానికి వారి ద్వారా భారత క్రికెట్‌కు ఒరిగేది ఏమీ ఉండదు.
1983లో భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్ అందించిన విజేతలకు కూడా చాలా ప్రామిస్‌లు చేశారు. వీటి గురించి మీడియలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మీడియాను తప్పుబట్టాల్సిన పనిలేదు.
సిగ్గులేని వాళ్లుంటారు
విజేతలకు వచ్చిన నజరానాల గురించి వారు పెద్ద పెద్ద హెడింగ్‌లు పెడతారంతే!.. అయితే, విజేతలతో పాటు మీడియాను కూడా కొంత మంది సిగ్గులేని వాళ్లు ఉపయోగించుకుంటారని వారికీ తెలిసి ఉండదు. కాబట్టి.. అమ్మాయిలూ.. ఇలాంటి సిగ్గులేని వ్యక్తులను ఉపేక్షించవద్దు.
తమ ప్రచారం కోసం మీ పేరును వాడుకుంటారు. 1983 విజేతల తరఫు నుంచి మీకో మాట చెప్పదలచుకున్నా.. భారత క్రికెట్ అభిమానుల ప్రేమే అన్నింటికంటే గొప్ప సంపద. మీకూ ఇది వర్తిస్తుంది. మరోసారి విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు.
కాగా వరల్డ్‌కప్‌లో భారత్ గెలవగానే గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి.. మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు ఇస్తానని ప్రకటించాడు. మరో కార్ల కంపెనీ ఇంకా లాంచ్ చేయని వర్షన్‌ను విజేతలకు కానుకగా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో గావస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’


