అందుకు అతడే అర్హుడు.. తప్పించలేమని.. ఎంపిక చేస్తే ఎలా? | Selection Shouldn't Be About What Best For Kohli Rohit BCCI Sent message | Sakshi
Sakshi News home page

అందుకు అతడే అర్హుడు.. తప్పించలేం కాబట్టి ఎంపిక చేస్తే ఎలా?

Jun 25 2026 10:40 AM | Updated on Jun 25 2026 10:52 AM

Selection Shouldn't Be About What Best For Kohli Rohit BCCI Sent message

అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. ఐర్లాండ్‌లో అడుగుపెట్టింది. ఐరిష్‌ జట్టుతో టీ20 సిరీస్‌ ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా సిరీస్‌లకు బీసీసీఐ తమ జట్లను ప్రకటించింది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి ప్రయోజనాల కోసం జట్టుకు ఎంపిక చేయొద్దని.. జట్టు గురించి మాత్రమే ఆలోచించాలంటూ సెలక్టర్లకు హితవు పలికాడు.

అందుకు అతడే అర్హుడు
రోహిత్‌ శర్మ స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తే బాగుంటుందని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆడిన గత మూడు వన్డేల్లో యశస్వి జైస్వాల్‌ రెండు శతకాలు బాదాడు. సౌతాఫ్రికా మీద 116 పరుగులతో అజేయంగా నిలిచిన జైసూ.. ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌పై వరుసగా 4, 110* పరుగులు చేశాడు.

భారత వన్డే జట్టు ఓపెనింగ్‌ జోడీలో ఒకరిగా ఎవరికైనా అవకాశాలు రావాల్సి ఉందంటే.. అందుకు జైస్వాల్‌ అర్హుడు. కానీ దురదృష్టవశాత్తూ అతడికి అవకాశాలు రావడం లేదు. ఒకవేళ సెలక్టర్లు రోహిత్‌ శర్మను వన్డే వరల్డ్‌కప్‌-2027 ప్రణాళికల్లో భాగం చేయాలనుకుంటే అది వాళ్ల ఇష్టం.

తప్పించలేము కాబట్టి ఎంపిక చేస్తామంటే ఎలా?
నిజానికి భారత క్రికెట్‌లో ‘స్టార్‌’ ప్లేయర్లకు ఎల్లప్పుడూ పెద్దపీట వేసే సంప్రదాయం ఉంది. వ్యక్తిగత ఇమేజ్‌, ఆట తీరు దృష్ట్యా మాత్రమే వారికి అవకాశాలు దక్కుతాయి. ఇప్పుడు రోహిత్‌ విషయంలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది. నిజంగానే అతడు వరల్డ్‌కప్‌ జట్టుకు అవసరమని భావించి సెలక్ట్‌ చేస్తే ఫర్వాలేదు.

అంతేగానీ.. అతడిని తప్పించలేము కాబట్టి ఆడిస్తాం అంటే కుదరదు. విరాట్‌, రోహిత్‌ లేదంటే బుమ్రాకు ఏది అత్యుత్తమం అని కాకుండా.. జట్టు ప్రయోజనాల కోసం ఏమి చేయాలి? భారత క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? అన్న అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. 

కాగా అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాగా అఫ్గన్‌తో సిరీస్‌కు కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో జైస్వాల్‌ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్‌ పర్యటనతో కోహ్లి తిరిగి జట్టుతో చేరనున్నాడు.

చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్‌ బ్యాటింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement