రాజస్తాన్ రాయల్స్ జెర్సీలో సంజూ (పాత ఫొటో PC: BCCI)
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల్ జోసెఫ్ (Basil Joseph) కూడా కనిపించడం విశేషం.
రూ. 18 కోట్లు చెల్లించి
ఐపీఎల్-2026 వేలానికి ముందే సీఎస్‌కే సంజూ శాంసన్ (Sanju Samson)ను తమ ఫ్రాంఛైజీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ రాయల్స్ నుంచి సంజూను సీఎస్‌కే సొంతం చేసుకుంది. రాయల్స్ కెప్టెన్‌ను తమ జట్టులో చేర్చుకునేందుకు.. దాదాపు పదమూడేళ్లుగా తమతో కలిసి ప్రయాణం చేస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై వదులుకుంది.
వైస్ కెప్టెన్‌గా సంజూ!
జడ్డూతో పాటు.. సామ్ కర్రాన్‌ను కూడా రాజస్తాన్ రాయల్స్‌కు ఇచ్చేసి.. సంజూను ట్రేడ్ చేసుకుంది సీఎస్‌కే. అంతేకాదు.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా సంజూను నియమించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. ఇక సంజూకు స్వాగతం పలుకుతూ.. ‘‘చేటా ఈజ్ హియర్ (అన్న వచ్చేశాడు)’’ సీఎస్‌కే షేర్ చేసిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.
భారీ కటౌట్
ఇందులో బాసిల్ జోసెఫ్.. ‘‘సోదరా.. సమయం వచ్చింది. పని మొదలుపెట్టండి.. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు. మన వాళ్లందరినీ తీసుకురండి. సమయానికల్లా అంతా సిద్ధమైపోవాలి’’ అని చెప్పగా ఓ బృందమంతా కలిసి రాత్రీపగలు కష్టపడి సంజూ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తాయి.
ఈ క్రమంలోనే సంజూ కూడా ఎల్లో జెర్సీ వేసుకుని రెడీ అయిపోతాడు. ఆఖర్లో విక్రమ్ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సంజూ ఎంట్రీకి మరింత హైప్ ఇచ్చారు. ‘‘రావాలనుకున్నపుడే.. సరైన సమయంలోనే వచ్చా’’ అన్న క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సంజూ శాంసన్ చాలా ఏళ్లుగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2022లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
అయితే, గతేడాది ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇందుకు తోడు మేనేజ్‌మెంట్‌తో విభేదాలు తలెత్తాయనే వార్తలు రాగా.. సంజూ సీఎస్‌కేకు మారడం గమనార్హం. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 172 ఇన్నింగ్స్ ఆడిన సంజూ 4704 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు!


