నాన్న తోడుగా... నాన్న కోసం...  | Sakshi Interview About Archery Gold Medals Winner Chikitha Taniparthi | Sakshi
Sakshi News home page

నాన్న తోడుగా... నాన్న కోసం... 

Oct 6 2026 6:16 AM | Updated on Oct 6 2026 6:16 AM

Sakshi Interview About Archery Gold Medals Winner Chikitha Taniparthi

ఆర్చర్‌ చికిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం

ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలతో సంచలనం

పక్కా ప్రణాళికతో మంచి ఫలితాలు

‘మా అమ్మాయి ఆటలోకి అడుగు పెట్టినప్పుడు ఆమె ఎంత వరకు ముందుకు వెళుతుందో, ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో అని భయపడలేదు. అసలు ఆర్చరీ గురించి అవగాహనే లేని నాకు వైఫల్యాల గురించి ఆలోచనే రాలేదు. నాకు తెలిసిందల్లా ఆమె ఆర్చరీని ఇష్టపడింది. దానికి తగినట్లుగా కష్టపడేందుకు సిద్ధంగా ఉంది.

 నేను ఎలా సహకరించగలననే విషయంపై మాత్రమే ఒక తండ్రిగా దృష్టి పెట్టాను’... ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ  పతకాలు సాధించి సంచలనం సృష్టించిన తెలంగాణ ఆర్చర్‌ తానిపర్తి చికిత తండ్రి శ్రీనివాస రావు మనసులో మాట ఇది. 

ఆర్చరీలో తొలి అడుగు వేయడం మొదలు ఏషియాడ్‌లో స్వర్ణాల వరకు అన్నింటా చికితకు తండ్రి అండగా ఉన్నాడు. ఈ క్రమంలో వచ్చిన అడ్డంకులు, ఆర్థిక అవరోధాలు అన్నింటినీ వారు అధిగమించారు. కాంపౌండ్‌ ఈవెంట్‌లో తక్కువ వ్యవధిలో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా తన స్థాయిని పెంచుకున్న చికిత, ఆమె తండ్రి వారి ప్రయాణాన్ని ‘సాక్షి’ క్రీడా ప్రతినిధితో ప్రత్యేకంగా పంచుకున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: కరాటే సర్టిఫికెట్‌కు పెద్దగా విలువ లేదు, ఆటల్లో గుర్తింపు రావాలంటే మరో క్రీడను ఎంచుకోవాల్సిందే... చికిత తండ్రితో అక్కడి పీఈటీ మాస్టర్‌ ఈ మాట చెప్పినప్పుడు ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ఎంతో ఇష్టంతో నేర్చుకున్న కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ వచ్చిన తర్వాత అది పనికిరాదంటే ఇలాంటి స్పందన సహజమే. దాంతో మరొకరి సూచనతో బ్యాడ్మింటన్‌ గురించి చర్చ జరిగింది. కానీ అప్పటికే ఈ ఆట కూడా ఖరీదైనదిగా మారిపోయింది. 

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ నుంచి కనీస శిక్షణకు హైదరాబాద్‌కు రావడంతో పాటు ఇతర ఖర్చుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. ‘ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం నేను స్థానికంగా వాలీబాల్‌ ఆడా. ఆపై అన్ని క్రీడా వార్తలు, వాటి ఫలితాలపై ఆసక్తిగా చూసేవాడిని. ఆ రకంగా నాకున్న అవగాహన మేరకు ఏదైనా సరే టీమ్‌ గేమ్‌ కాకుండా వ్యక్తిగత క్రీడను ఆడించాలని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాను. అలాంటప్పుడు జరిగిన చర్చ తర్వాత ఆర్చరీ వైపు అడుగు పడ్డాయి’ అని శ్రీనివాస రావు అన్నారు. 

ప్రాథమికాంశాలు తెలుసుకున్న తర్వాత స్థానికంగా కొని తెచ్చిన విల్లుతో చికిత ఆట మొదలైంది. ‘ఆ సమయంలో కాంపౌండ్, రికర్వ్‌లాంటి పదాలు కూడా నాకు తెలీదు. స్కోరింగ్, పాయింట్ల గురించి కూడా అవగాహన లేదు. ఎదురుగా లక్ష్యం ఉంటుంది. దానిని ఎంత బాగా ఛేదించాలి, ఎంత పర్‌ఫెక్ట్‌గా బాణం తగలాలి అన్నది ఒక్కటే నాకు తెలుసు. నేను చేసిన పని కూడా అదే’ అని చికిత చెప్పింది. సొంతంగానే గంటలకొద్దీ సాధన చేస్తూ శ్రమించిన చికిత బాణం నిజంగానే గురి తప్పలేదు. స్కూల్‌ గేమ్స్‌లో అసలు పోటీ అన్నదే లేకుండా తక్కువ వ్యవధిలో వరుస విజయాలు సాధించింది.

అదే అసలు మలుపు... 
ఆటలో ఒక అంకం పూర్తయింది. కానీ ఇంకా ముందుకు వెళ్లాలంటే ఎలా! నాన్న మదిని తొలచిన ప్రశ్న ఇది. ఈసారి కాస్త సీరియస్‌గా ఆయన కూతురి కెరీర్‌పై దృష్టి పెట్టాడు. ‘రాష్ట్ర అసోసియేషన్‌లు నిర్వహించే టోరీ్నల ద్వారా సరైన గుర్తింపు లభిస్తుందని కొందరు సన్నిహితులు చెప్పారు. దాంతో రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ నుంచి సీనియర్‌ వరకు అన్ని టోరీ్నల్లో ఆడటం మొదలైంది. ఫలితాలు కూడా వస్తుండటంతో ధైర్యం పెరిగింది. 

ఈ టోర్నీలలో ఆడే క్రమంలో మరింత మెరుగైన ఎక్విప్‌మెంట్‌ను ఎంచుకునే క్రమంలో జరిగిన ఒక సంభాషణ చికితకు మేలు చేసింది’ అని శ్రీనివాస రావు గుర్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో ‘మై చాయిస్‌ ఆర్చరీ’ పేరుతో ఆర్చర్‌ ఎక్విప్‌మెంట్‌ స్టోర్‌ ఉంది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్చర్, అర్జున అవార్డీ అభిషేక్‌ వర్మ భార్య సొనాలీ వర్మ దానిని నిర్వహిస్తుంది. ‘కెరీర్‌పై స్పష్టత వచ్చిన తర్వాత కాంపౌండ్‌ ఈవెంట్‌ను పూర్తి స్థాయిలో ఎంచుకున్నాను.

 నా ఎక్విప్‌మెంట్‌ గురించి అడిగే క్రమంలో నా ఆట, పెర్ఫార్మెన్స్‌ గురించి కూడా సొనాలీకి వివరించా. ముందుగా ఆమె పట్టించుకోలేదు. కానీ నాలుగైదుసార్లు నేనే వెంటపడి సరైన మార్గనిర్దేశనం కోసం అడిగా. చివరకు ఆమె అభిషేక్‌కు చెబుతానని, ఢిల్లీకి రమ్మని ఒప్పుకుంది. అక్కడే నా కెరీర్‌ మారింది. నాకు అభిషేక్‌ రూపంలో మంచి కోచ్‌ దొరికారు’ అని చికిత వెల్లడించింది. 

ఢిల్లీలోని యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో వారం రోజుల పాటు తన ఆట గురించి ట్రయల్స్‌ ఇచ్చిన తర్వాత అభిషేక్‌కు ఆమెపై నమ్మకం పెరిగింది. కోచ్‌గా ఒక యువ క్రీడాకారిణిని తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. అయితే అక్కడే శిక్షణ తీసుకునే ఆర్థిక స్థాయి లేకపోవడంతో అది వారానికే పరిమితమైంది. తండ్రితో పాటు తిరిగి సొంతూరుకు వచ్చిన చికిత మళ్లీ తన ఆటను కొనసాగించింది. ఇంతలో కోవిడ్‌ రావడం, అన్ని ఆగిపోవడంతో ప్రాక్టీస్‌ మాత్రమే చికిత రోజూవారీ కార్యక్రమంగా మారిపోయింది. వీడియో కాల్, ఆడియో మెసేజ్‌ల ద్వారా అభిషేక్‌ తగిన సలహాలు, సూచనలు ఇస్తుండటంతో చికిత ఆర్చరీ మరింత మెరుగైంది.

‘సాయ్‌’ శిక్షణలో చేరికతో...
ఈ ఆసియా క్రీడలకు కొన్నాళ్ల ముందునుంచి చికిత నిలకడగా విజయాలు సాధిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. కానీ కోవిడ్‌ రోజులనుంచి రెండేళ్ల క్రితం వరకు ఈ తండ్రీ కూతుళ్ల ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఎక్విప్‌మెంట్‌ మాత్రమే కాకుండా డైట్,ప్రయాణాలు, ఇతర ఖర్చులు సమస్యగా మారాయి. రైతు అయిన శ్రీనివాస రావు తన శక్తిమేర ఖర్చు చేశారు. 

మధ్యలో కొందరు స్వల్ప మొత్తాలతో సహకరించారు. ‘మరోవైపు నేను ఆమెకు లక్ష్యాలను నిర్దేశించాను. కాంపౌండ్‌లో రాష్ట్ర, జాతీయ అత్యుత్తమ రికార్డుల గురించి తెలుసుకుంటూ దానికంటే మెరుగైన స్కోరింగ్‌ లక్ష్యంగా పెట్టుకునేలా చికితను ప్రోత్సహించాను’ అని ఆయన చెప్పారు. సీనియర్‌ నేషనల్స్‌లో రాణించడంతో చికిత గురించి అందరికీ తెలిసింది. 

ఆపై సోనేపట్‌లోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) సెంటర్‌ లో సీటు కోసం నిర్వహించిన సెలక్షన్స్‌లో ఆమె ఎంపికైంది. ‘నా కెరీర్‌ కోసం సరైన చోటికి చేరుకున్నానని అర్థమైంది. దాదాపు పదేళ్ల నాన్న కష్టాన్ని అసలైన ఫలితాల రూపంలో చూపించేందుకు ఇక్కడ అవకాశం లభించింది. ఇప్పుడు వచ్చిన మెడల్స్‌తో నాన్నపై భారం దిగినట్లుగా అనిపించింది’ చికిత ఉద్వేగంగా చెప్పింది. కూతురి ప్రస్థానాన్ని నడిపించిన నాన్న ఇప్పుడు కొడుకు యశ్వంత్‌నూ ఆర్చర్‌గా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే జూనియర్‌ నేషనల్స్‌ ఆడిన అతను ప్రొఫెషనల్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement