IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’ | R Ashwin praises Indian selectors decision ahead IND vs AFG 2nd ODI | Sakshi
Sakshi News home page

IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’

Jun 15 2026 5:11 PM | Updated on Jun 15 2026 5:52 PM

R Ashwin praises Indian selectors decision ahead IND vs AFG 2nd ODI

టీమిండియా సెలక్టర్లపై భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రశంసలు కురిపించాడు. విమర్శలకు బెదరకుండా సరైన ఆటగాడినే జట్టుకు ఎంపిక చేశారని కొనియాడాడు. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఆకిబ్‌ నబీకి మొండిచేయి 
అంతకుముందు అఫ్గన్‌తో ఏకైక టెస్టు ఆడింది శుబ్‌మన్‌ గిల్‌ సేన. ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో గుర్నూర్‌ బ్రార్‌కు చోటు ఇచ్చారు సెలక్టర్లు. రంజీ ట్రోఫీ 2025-26లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీకి మాత్రం మొండిచేయి చూపారు.

ఈ నేపథ్యంలో ఆకిబ్‌ నబీ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించి.. అతడికి బదులు గుర్నూర్‌ను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రంజీల్లో ఒకే సీజన్‌లో అరవైకి పైగా వికెట్లు సాధించినా ఆకిబ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి.

వన్డేతో అరంగేట్రం
ఇక అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌లో గుర్నూర్‌ బ్రార్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. ఈ పేస్‌ బౌలర్‌తో పాటు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబే కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఇద్దరూ రాణించారు
ఇక తన తొలి ఓవర్లోనే వికెట్‌ తీసిన గుర్నూర్‌ బ్రార్‌.. మొత్తంగా 4.5 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు.. హర్ష్‌ దూబే ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 47 రన్స్‌ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

సెలక్టర్ల నిర్ణయం సరైందే
ఈ నేపథ్యంలో అశ్విన్‌ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఆకిబ్‌ నబీని కాదని గుర్నూర్‌ను ఎంపిక చేసి మంచి పనిచేశారన్నాడు. ఈ మేరకు.. ‘‘గుర్నూర్‌ బ్రార్‌ తొలి మ్యాచ్‌లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు పొడుగ్గా ఉంటాడు. బలంగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

ప్రతీ బంతిని గంటకు 145కు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అతడి బౌలింగ్‌ నైపుణ్యం, శైలి.. బంతిని స్వింగ్‌ చేసే విధానం అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతడు ఇంకా వేగంగా కూడా బౌలింగ్‌ చేయగలడు.

సెలక్టర్లు ఆకిబ్‌ నబీని కాదని గుర్నూర్‌ ఎంపిక చేసినపుడు చాలా మంది విమర్శించారు. అయితే, వారి నిర్ణయం సరైందే. వాళ్లిద్దరి మధ్య పోలిక ఇక్కడ అనవసరం. గుర్నూర్‌ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు, కోచ్‌లను తప్పక అభినందించాల్సిందే.

భవిష్యత్తులో టీమిండియా స్టార్‌ బౌలర్‌గా
ఒకవేళ అతడు ఫిట్‌గా ఉండి.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. భారత పేస్‌ దళంలో కీలక సభ్యుడిగా మారగలడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్‌ బౌలర్‌గా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని అశ్విన్‌.. 26 ఏళ్ల గుర్నూర్‌ బ్రార్‌తో పాటు సెలక్టర్లను ప్రశంసించాడు. 

అదే విధంగా.. హర్ష్‌ దూబే సైతం మున్ముందు జట్టుకు బాగా ఉపయోగపడతాడని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా వర్షం వల్ల తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించగా.. భారత్‌ అఫ్గన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

చదవండి: 29 బంతుల్లోనే చహల్‌ సెంచరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement