source: X
నిత్యం ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో ఉండే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తాజాగా తన చిరకాల సహచరుడు రవీంద్ర జడేజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత వైట్ బాల్ జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా కంటే అక్షర్ పటేల్ బెటర్ ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు. ఫింగర్ స్పిన్నర్‌గా అక్షర్ ఎక్కువ ప్రభావం చూపుతున్నాడని చెప్పాడు.
తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన అశ్విన్.. వైట్ బాల్ క్రికెట్‌లో జడేజా కంటే అక్షర్ పటేల్‌కు ఎక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణాలను వివరించాడు. అక్షర్ బౌలింగ్‌లోని చిన్న చిన్న మార్పులు, మ్యాచ్ వివిధ దశల్లో బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడికి అదనపు బలమని చెప్పాడు. వైట్ బాల్ క్రికెట్‌లో ఫింగర్ స్పిన్నర్లకు ప్రతిసారి భారీగా వికెట్లు దక్కవని చెబుతూనే, అక్షర్ తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నాడని ప్రశంసించాడు. తన అభిప్రాయానికి అక్షర్ గణాంకాలే నిదర్శనమని అన్నాడు.
కాగా, ఈ ఏడాది అక్షర్ 22 టీ20ల్లో 22.41 సగటున, 8.12 ఎకానమీ రేట్‌తో 27 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 3 మ్యాచ్‌ల్లో 5.48 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో 100 స్ట్రైక్‌రేట్‌తో 60 పరుగులు చేశాడు.
మరోవైపు జడేజా ఈ ఏడాది 5 వన్డేల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. అతడి బౌలింగ్ సగటు 135.00గా ఉండగా.. ఎకానమీ రేట్ 6.28గా ఉంది.
గణాంకాలు, బౌలింగ్‌లో వైవిధ్యం, బ్యాటింగ్ మెళకువలతో పాటు వయసు కూడా అక్షర్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుంది. ప్రస్తుతం జడ్డూకు 37 ఏళ్లు కాగా.. అక్షర్‌కు 32 ఏళ్లే. పై అంశాలన్ని పరిగణలోకి తీసుకుంటే అశ్విన్ చెప్పినట్లు జడేజా కంటే అక్షర్ పటేలే టీమిండియాకు బెటర్ అప్షన్ అవుతాడు.
ఇదీ చదవండి: టీమిండియా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం!


