PC: BCCI X
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఎంపిక చేసిన తుదిజట్టుపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ లైనప్ ఆధారంగానే.. సీనియర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పక్కనపెట్టినట్లు తెలిపాడు.
కివీస్ జట్టులో ఎక్కువగా ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారని.. అందుకే జడ్డూను కాదని వాషింగ్టన్ సుందర్‌ను ఆడించినట్లు కొటక్ వివరించాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్‌టన్‌లో భారత్- కివీస్ మధ్య గురువారం తెల్లవారుజామున తొలి టెస్టు మొదలైంది.
అద్వితీయ పోరాటం
టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 82 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఆదిలోనే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను హెన్రీ నికోల్స్ (113*) గ్లెన్ ఫిలిప్స్ (94*) అద్వితీయ పోరాటంతో గట్టెక్కించారు.
ఇదిలా ఉంటే.. ముందుగా చెప్పినట్లుగానే నలుగురు స్పెషలిస్టు పేసర్లతో భారత్ బరిలోకి దిగింది. సీనియర్ మహ్మద్ సిరాజ్‌ను కాదని జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణతో పాటు అన్షుల్ కాంబోజ్‌కు చోటు ఇచ్చింది. మరోవైపు.. జడ్డూను పక్కనపెట్టి యువ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసింది.
వాళ్ల కోసమే.. అతడిని పక్కనపెట్టేశాము
ఈ నేపథ్యంలో తొలి రోజు ఆట పూర్తైన తర్వాత టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ జడ్డూను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వివరించాడు. ‘‘న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌లో నలుగురు లెఫ్టాండర్ బ్యాటర్లు ఉన్నారు. అందుకే ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాలని మేము భావించాము.
కాబట్టి సుందర్ జట్టులోకి వచ్చాడు. తొలి, రెండో ఇన్నింగ్స్‌ను దృష్టిలో పెట్టుకునే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ కూడా చేయగలడు’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. కాగా కివీస్ ఓపెనర్లు కెప్టెన్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే.. వన్‌డౌన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్, నాలుగో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర.. ఇలా నలుగురూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కావడం విశేషం.
వీరిలో లాథమ్‌ను బుమ్రా డకౌట్ చేయగా.. కాన్వే (4) వికెట్‌ను అన్షుల్ కాంబోజ్ దక్కించుకున్నాడు. రచిన్ రవీంద్ర (15)ను ఆకాశ్ దీప్ పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో సుందర్ తొలి రోజు 16 ఓవర్లు బౌలింగ్ చేసి 2.40 ఎకానమీతో 38 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు.
ఇదీ చదవండి: పడిక్కల్, పంత్ కొంపముంచేశారు!.. కెప్టెన్ ఆగ్రహం.. వీడియో


