రంజీ ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు డబుల్ సెంచరీ (141 బంతుల్లో) చేసిన షా.. ప్రస్తుతం కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షా 92 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేశాడు.
ఇవాళ షా 26వ జన్మదినం. తన పుట్టిన రోజున షా అర్ద సెంచరీ బాది తనకు తనే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. ఈ రంజీ ట్రోఫీకి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. సెంచరీల మోత మోగిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. చండీఘడ్‌పై డబుల్ సెంచరీకి ముందు కేరళపై అర్ద సెంచరీ (75) చేశాడు.
అంతకుముందు ముంబైతో జరిగిన రంజీ వార్మప్ మ్యాచ్‌లో 181 పరుగులు చేశాడు. దానికి ముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్‌ఘడ్‌పై 111 పరుగులు చేశాడు. షా ప్రస్తుత ఫామ్ చూస్తే మరోసారి టీమిండియా తలుపులు తట్టేలా ఉన్నాడు. అయితే ఇది అంత ఈజీ ఏమీ కాదు. టెస్ట్‌ల్లో టీమిండియా ఓపెనర్ స్థానానికి చాలా పోటీ ఉంది. యువ ఓపెనర్లంతా రాణిస్తున్నారు.
షా సహచరుడు రుతురాజ్ గైక్వాడ్ సైతం పరుగుల వరద పారిస్తున్నా అతనికే చోటు దక్కడం లేదు. టీమిండియాలో యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా స్థిర పడిపోయారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర 113 పరుగులు వెనుకపడి ఉంది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేయగా.. మహారాష్ట్ర 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
కర్ణాటక తరఫున కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (80), స్మరన్ రవిచంద్రన్ (54), శ్రేయస్ గోపాల్ (71) అర్ద సెంచరీలతో రాణించగా.. మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా ఒక్కడే అర్ద సెంచరీతో మెరిశాడు. శ్రేయస్ గోపాల్ (23-3-46-3) బంతితోనూ రాణించి మహారాష్ట్రను దెబ్బ కొట్టాడు.
చదవండి: భారీ లక్ష్యాన్ని ఊదేసిన సౌతాఫ్రికా


