భారత్-ఏ, సౌతాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 417 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. జోర్డన్ హెర్మన్ (91), లెసెగో సెనోక్వానే (77), జుబేర్ హంజా (77), టెంబా బవుమా (59), వికెట్ కీపర్ కాన్నర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికాను గెలిపించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ జురెల్ (132 నాటౌట్) అజేయ సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అనంతరం సౌతాఫ్రికా కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. టీమిండియా పేసర్ల ధాటికి 221 పరుగులకే ఆలౌటైంది.
34 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 7 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జురెల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయ సెంచరీతో (127 నాటౌట్) చెలరేగాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (65), హర్ష్ దూబే (84) అర్ద సెంచరీలతో రాణించారు.
భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఐదుగురు అర్ద సెంచరీలు చేసి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లు పోరాడినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.
కాగా, ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ నవంబర్ 13 నుంచి మొదలవుతుంది.
చదవండి: వరుసగా 8 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ


