పాక్‌ క్రికెట్‌ జట్టుకు మరోసారి జరిమానా | NZ VS PAK 2nd ODI: ICC Punishes Pakistan, Rizwan And Co Fined For Major Code Of Conduct Breach | Sakshi
Sakshi News home page

పాక్‌ క్రికెట్‌ జట్టుకు మరోసారి జరిమానా

Apr 3 2025 6:51 PM | Updated on Apr 3 2025 7:36 PM

NZ VS PAK 2nd ODI: ICC Punishes Pakistan, Rizwan And Co Fined For Major Code Of Conduct Breach

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింది. ఫలితంగా ఆ జట్టుకు భారీ జరిమానా విధించారు. వివరాల్లో​కి వెళితే.. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్‌ క్రికెట్‌ జట్టు నిన్న (ఏప్రిల్‌ 2) జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌తో బౌలింగ్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ నిర్ణీత సమయం పూర్తయ్యే లోపు ఓ ఓవర్‌ వెనుకపడింది.

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఓ జట్టు నిర్ణీత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయని పక్షంలో ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ నిర్ణీత సమయంలోపు ఓ ఓవర్‌ వెనుకపడింది. ఫలితంగా ఆ జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్‌ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధించారు.

అంతకుముందు తొలి వన్డేలోనూ పాక్‌ స్లో ఓవర్‌ రేట్‌ తప్పిదం చేసింది. ఆ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా రెండు ఓవర్లు తక్కువ వేసింది. ఫలితంగా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌లో పది శాతం కోత విధించారు. స్లో ఓవర్‌ రేట్‌ విషయంలో పాక్‌ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ శిక్షను అంగీకరించడంతో ఐసీసీ ఎలాంటి విచారణ నిర్వహించలేదు. 

స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్‌ చేసిన రెండు వన్డేల్లో పాక్‌ ఘోర పరాజయాలు ఎదుర్కొని 3 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. నామమాత్రపు మూడు వన్డే ఏప్రిల్‌ 5న మౌంట్‌ మాంగనూయ్‌లో జరుగనుంది.

వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా పాక్‌ 1-4 తేడాతో కోల్పోయింది. ఈ న్యూజిలాండ్‌ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో పాక్‌ ఒకే ఒక మ్యాచ్‌ (మూడో టీ20) గెలిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement