టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయాలతో సావాసం చేస్తున్నాడు. తొలుత ఐపీఎల్-2026లో హార్దిక్ వెన్ను గాయానికి గురయ్యాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడంతో అతడు తన గాయం నుంచి కోలుకునేందుకు నేరుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లాడు. హార్దిక్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తుండడంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతాడని అంతా భావించారు. కానీ రిహాబిలిటేషన్ దశలోనే హార్దిక్‌కు మరో సమస్య ఎదురైంది.
వైద్య పరీక్షల సమయంలో అతడి తొడ కండరాల గాయం బారిన పడినట్లు తేలింది. దీంతో పాండ్యా అఫ్గాన్‌తో వన్డేలతో పాటు ఇంగ్లండ్ టూర్‌కు కూడా దూరమ్యాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉన్నాడు.
వన్డే ప్రపంచకప్-2027 ముందు హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆల్‌రౌండర్ ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతుండడం భారత జట్టు మేనెజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా రాబోయో వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడన్న హామీ తాను ఇవ్వలేనని కైఫ్ అన్నాడు.
"హార్దిక్ పాండ్యా వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఆడుతాడన్న నమ్మకం నాకు లేదు. అతడి పరిస్థితి ఏంటో ఆర్ధం కావడం లేదు. ఏదేమైనప్పటికి హార్దిక్ బిగ్ మ్యాచ్ విన్నర్. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అతడి స్ధానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.
ఆ విషయం పాండ్యాకు కూడా తెలుసు. కానీ అతడి శరీరం సహకరించడం లేదు. 2023 నుంచి అతడు తరుచూ గాయాల బారిన పడుతూనే ఉన్నాడు. అతడి ఫిట్‌నెస్ గురుంచి సరైన అప్‌డేట్ ఎవరూ ఇవ్వడం లేదని" కైఫ్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.


