PC: ACC
టీమిండియా వైపు మరో పేస్ సంచలనం దూసుకొస్తున్నాడు. గంటకు 145 కి.మీ వేగానికి పైగా బంతులు విసిరి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత తరపున అదరగొట్టిన ఈ యువ పేసర్.. ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తాచాటాడు.
అతడే 18 ఏళ్ల స్పీడ్‌స్టర్ దీపేష్ దేవేంద్రన్. దీపేష్ బుధవారం తిరుచ్చి గ్రాండ్ చోళాస్‌తో జరిగిన మ్యాచ్‌లో మధురై పాంథర్స్ తరపున టీఎన్‌పీఎల్ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే దేవేంద్రన్ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో 25 పరుగలిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.
ఈ రైట్ ఆర్మ్ పేసర్ వికెట్లు ఎక్కువగా తీయకపోయినప్పటికి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 16వ ఓవర్ మొదటి బంతిని ఏకంగా 146 కి.మీ/గం వేగంతో విసిరి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు.
అదే ఓవర్‌లో మరో మూడు సార్లు 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసురుతూ, కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడి బౌలింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు అతడు కచ్చితంగా భారత సీనియర్ జట్టులోకి వస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే అతడి టీమ్‌మేట్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
కాగా గత కొంత కాలంగా దీపేష్ వైట్‌బాల్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఆసియాకప్-2025 ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికి.. దీపేష్ టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి టోర్నీలోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై జరిగిన యూత్ టెస్టు సిరీస్‌లోనూ అతడు అదరగొట్టాడు.
బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మొత్తంగా రెండు మ్యాచ్‌లు కలిసి దీపేష్ పది వికెట్లు పడగొట్టాడు. వినూ మన్కడ్ ట్రోఫీలోనూ తమిళనాడు తరఫున అతడు సత్తాచాటాడు. ఇక అండర్ 19 ప్రపంచకప్-2026ను భారత్ సొంతం చేసుకోవడంలో దీపేష్‌ది కీలక పాత్ర. సెమీస్, ఫైనల్లో కలిపి అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే మాదిరి లంక బ్యాటర్ల విధ్వంసం


