సిక్సర్ల వర్షం.. 20 ఓవర్లలో 290 పరుగులు | Meet Ashwin Hebbar, APL Sensation Who Can Earn Millions In IPL 2027 Auction | Sakshi
Sakshi News home page

APL 2026: సిక్సర్ల వర్షం.. 20 ఓవర్లలో 290 పరుగులు

Jun 22 2026 5:28 PM | Updated on Jun 22 2026 5:39 PM

Meet Ashwin Hebbar, APL Sensation Who Can Earn Millions In IPL 2027 Auction

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌-2026లో క‌డ‌ప వేదిక‌గా కాకినాడ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విజయవాడ సన్‌షైనర్స్ బ్యాట‌ర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్లు మున్నంగి అభినవ్‌ , కెప్టెన్‌ అశ్విన్‌ హెబ్బార్ విధ్వంసకర శతకాలతో కాకినాడ కింగ్స్‌ బౌలర్లను ఊచకోత కోశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కడప మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. వారిని ఆపడం కాకినాడ బౌలర్ల తరం కాలేదు.

అభినవ్‌ కేవలం 69 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. అశ్విన్‌ హెబ్బార్‌ కేవలం 53 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు ఏకంగా 260 కి పైగా పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభినవ్‌, అశ్విన్ విధ్వంసం ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన  విజయవాడ సన్‌షైనర్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి ఏకంగా 290 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక టోటల్ కావడం విశేషం.

291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది.  కెప్టెన్‌ మనీష్‌ గొలమారు (0) ఖాతా తెరవకుండానే అవుట్‌ కాగా, అర్జున్‌ టెండూల్కర్‌ (17), అభిషేక్‌ రెడ్డి (9)లు త్వరగానే పెవిలియన్‌ చేరారు.  

మిడిలార్డర్‌లో పిన్నింటి తపస్వి (27), ఒమ్మి భాస్వంత్‌ కృష్ణ (30), మిట్టా లేఖాజ్‌ రెడ్డి (31), హరిశంకర్‌ రెడ్డి (20)లు పోరాడినప్పటికీ రన్‌ రేట్‌ ఒత్తిడి కారణంగా వికెట్లు సమర్పించుకున్నారు. విజయవాడ బౌలర్లలో బి.ప్రణవ్‌ రెడ్డి 3 వికెట్లు (3/30) తీసి కాకినాడ వెన్ను విరవగా, తన్నీరు భరత్‌ 2 వికెట్లు, సాయి వెంకట సుమిత్‌, సిద్ధార్థ, లలిత్‌ మోహన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టి విజయవాడకు భారీ విజయాన్ని అందించారు.

సూపర్ ఫామ్‌లో అశ్విన్‌
ఇక ఈ ఏడాది సీజన్‌లో విజయవాడ సన్‌షైనర్స్ కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే 79.67 సగటుతో ఏకంగా 478 పరుగులు సాధించాడు. ఈ పరుగులను అతడు  216.29 స్ట్రైక్ రేట్‌తో రాబట్టడం విశేషం. ఇందులో రెండు భారీ సెంచరీలు ఉన్నాయి. వైట్‌బాల్ క్రికెట్‌లో అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. ఆంధ్ర జట్టులో కీలక సభ్యునిగా అతడు కొనసాగుతున్నాడు. 58 లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో 2019 పరుగులు చేశాడు.

ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 69 టీ20 మ్యాచ్‌ల్లో 131.60 స్ట్రైక్ రేట్‌తో 1803 పరుగులు చేశాడు. కాగా 30 ఏళ్ల అశ్విన్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఐపీఎల్‌-2027 మెగా వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. నెల్లూర్‌కు చెందిన అశ్విన్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఈసారి మాత్రం అశ్విన్ హెబ్బార్‌కు జాక్‌పాట్ తగిలే అవకాశముంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement