అందరిలాగే ఆ యువకులకూ క్రికెట్ అంటే ప్రాణం.. అందరిలా వారు ఆదివారం ఒక్క రోజు ఆడి అలసిపోలేదు.. కల నెరవేరేదాకా నిర్లక్ష్యం దరిచేరనీయలేదు.. బంతితో దోస్తీ చేశారు. బ్యాటుతో కుస్తీ పట్టారు.. ఆ పిచ్చి ప్రేమే వారిని 22 గజాల క్రికెట్ ‘పిచ్’ వైపు నడిపించింది.. ఒకరు బంతితో సవాల్ విసిరితే.. మరొకరు బ్యాటుతో కమాల్ చేస్తున్నారు.. ఏపీ తరఫున రాష్ట్ర స్థాయి జట్టులోనే కాదు.. ఏపీఎల్, ఐపీఎల్ లాంటి లీగ్‌లోనూ ఆకాశమే హద్దుగా ప్రతిభ చూపిస్తున్నారు.
సాక్షి అన్నమయ్య : రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమలకు రామచంద్రారెడ్డి, లక్ష్మి దేవిల కుమారుడు హరిశంకర్‌రెడ్డి బౌలర్‌గా విశేష ప్రతిభ చూపిస్తున్నాడు. మారుమూల గ్రామంలో పుట్టి.. రైతు కుటుంబం నుంచి వచ్చిన హరి శంకర్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. 130–135 కిలోమీటర్స్ స్పీడుతో ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్‌తో బంతి విసురుతూ వికెట్లను గిరాటేస్తున్నాడు.
2011లో అండర్–16 జట్టుకు ఎంపికైన అతడు.. వరుసగా మ్యాచ్‌లు ఆడుతూ ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. 2015లో విజయనగరం ఆంధ్ర క్రికెట్ అకాడమిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. హరిశంకర్‌రెడ్డిలోని టాలెంట్‌గుర్తించిన కోచ్ పీడీ థాంసన్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. దీంతో అండర్–16 మొదలుకొని అండర్–18, అండర్–20లో రాణించి అంచెలంచెలుగా ఎదిగాడు. జిల్లా స్థాయి మొదలుకొని ఐపీఎల్ వరకు ఎన్నో మ్యాచ్‌లలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన మారంరెడ్డి హరిశంకర్‌రెడ్డి భారత జట్టులో స్థానమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు.

క్రికెట్ నీలాకాశంలో ‘ధ్రువ’తార
అతను ఓపిగ్గా సింగిల్, డబుల్స్ తీయగలడు.. జట్టుకు అవసరమైనప్పుడు బౌండరీలతో చెలరేగిపోగలడు.. అంతేనా కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించగలడు.. అతనే ప్రొద్దుటూరు శ్రీరాములపేటకు చెందిన క్రికెటర్ ఎస్. ధ్రువకుమార్ రెడ్డి. ఇటీవల జరిగిన ఏపీఎల్‌లో తన బ్యాటింగ్‌తో శభాష్ అనిపించాడు.
ప్రొద్దుటూరు కల్చరల్ : పట్టణంలోని శ్రీరాములపేటకు చెందిన ఎస్.ధ్రువకుమార్‌రెడ్డి క్రికెట్‌లో ఒపెనింగ్ రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తండ్రి సిగినేని లక్ష్మిరెడ్డి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా తల్లి శారదదేవి గృహిణి. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో 2006లో యూత్‌క్రికెట్ క్లబ్‌లో చేరి సాధన ప్రారంభించాడు. శిక్షణలో అన తి కాలంలోనే కోచ్‌ల నుంచి మెళకువలు నేర్చుకుని ఫొర్‌లు, సిక్సర్‌లు కొడుతూ మంచి రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. అండర్–22 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. సౌత్ ఇండియా అండర్–19 పోటీల్లో పాల్గొని తన బ్యాటింగ్‌తో అందరి మన్ననలు చూరగొన్నాడు.
రంజీ, వన్ డే, 20–20, టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాడు. ఐదేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్‌లీగ్ క్రికెట్ పోటీల్లో ఆడుతున్నాడు. క్రికెట్ పోటీల్లో మంచి నైపుణ్యంతో బ్యాట్స్‌మన్‌గా రాణిస్తుండటంతో ధ్రువకుమార్‌రెడ్డిని రాయల్స్ ఆఫ్ రాయలసీమ మేనేజ్‌మెంట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 మ్యాచ్‌లు ఆడి రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టును విజయం సాధించడంలో ముందుండి నడిపించాడు. వైజాగ్ లయన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 218 పరుగుల భారీ లక్షసాధనలో ఒంటరి పోరాటం చేస్తూ కేవలం 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్‌లతో 52 పరుగులు బాది కెపె్టన్ ఇన్నింగ్స్‌తో జట్టులో స్ఫూర్తి నింపాడు. కాగా ప్రస్తుతం ధ్రువ కుమార్‌రెడ్డి సికింద్రాబాద్ రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

కడప షెహర్ నుంచి ఆయా క్రికెట్‌కా షేర్!
నాన్న కుస్తీ పట్టులోని బలాన్ని తన ఒంటి నిండా నింపుకున్నాడు.. అన్న అందించిన ప్రోత్సాహాన్ని గుండెల్లో దాచుకున్నాడు.. వేదిక ఏదైనా.. జట్టు ఏదైనా.. బ్యాటు చేతబట్టి గ్రౌండులో దిగితే బంతి స్టాండ్‌లోకి వెళ్లాల్సిందే.. అతని ధనాధన్ ఇన్నింగ్స్‌కి జనం ఫిదా అవ్వాల్సిందే. అతనే కడప నగరానికి చెందిన క్రికెటర్ జహీర్ అబ్బాస్
కడప వైఎస్సార్ సర్కిల్ : కడప నగరం అల్మాస్ పేటకు చెందిన జహీర్ అబ్బాస్ బ్యాట్స్‌మెన్‌గా సత్తా చాటుతున్నాడు. ఇటీవల జరిగిన ఏపీఎల్‌లో టోర్నీ ఆద్యంతం చక్కటి ఇన్నింగ్స్‌లతో అలరించాడు. వరుసగా రెండో ఏడాది సూపర్ స్ట్రైకర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ స్టేడి యంలో సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో సూపర్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.
నాన్న బలం.. అన్న ప్రోత్సాహం
అల్మాస్‌పేటకు చెందిన షేక్ అన్సర్, షేక్ గౌసియా బేగం దంపతుల కొడుకు జహీర్ అబ్బాస్. తండ్రి కుస్తీ పహిల్వాన్. తల్లి గృహిణి. వీరి ముగ్గురు కుమారుల్లో జహీర్ మూడో వాడు. తమ్ముడిలోని క్రికెట్ నైపుణ్యం చూసిన ఇద్దరన్నలు రవూఫ్, జాఫర్ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ కోచింగ్‌కు పంపించా రు. అక్కడి సీనియర్ కోచ్ ఖాజా మెలకువలు జహీర్ లోని నైపుణ్యాన్ని సానబెట్టాయి. అలాగే కడప క్రికెట్ అసోసియేషన్ అధికారుల, సిబ్బంది అండ తోడైంది.
ఒక్కో మెట్టు ఎదుగుతూ.. కడప క్రికెట్ అసోసియేషన్‌లోని భరత్‌రెడ్డి, రెడ్డి ప్రసాద్ తదితరులు ఇచ్చిన ప్రోత్సాహంతో జహీర్ అబ్బాస్ వేగంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చా డు. తొలుత అండర్–16స్టేట్‌కు ఆడిన జహీర్, 2019–20లో అండర్–19 స్టేట్ జట్టుకు ప్రాతి నిధ్యం వహించాడు. ఇందులో 3 అర్థ సెంచరీలతో రాణించిన జహీర్ 200 స్ట్రైక్ రేట్ కలిగి ఉండడం విశేషం. ఆ ఏడాది అండర్ –19 ప్రపంచకప్ కోసం ఇండియన్ సెలెక్టర్ల నుంచి పిలుపునందుకున్న జహీర్ గ్వాలియర్‌లో ఎంపికలకు సైతం హాజరయ్యాడు.
ఏపీఎల్‌తో వెలుగులోకి.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జహీర్ అబ్బాస్‌లోని క్రికెట్ నైపుణ్యాన్ని ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇప్పటివరకు ఏపీఎల్ ఐదు సీజ న్లు జరగగా.. తొలి సీజన్ నుంచి ఆడుతున్న జహీర్ వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. తొలి సీజన్‌లోనే చాంపియన్ జట్టులో సభ్యుడుగా ఉండడం విశేషం. కాగా 2025లో సూపర్ స్ట్రైకర్ ఆప్ టోరీ్నగా నిలిచిన జహీర్, తాజాగా జరిగిన ఐదో సీజన్‌లోనూ సూపర్ స్ట్రైకర్ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ ఇతని పేరుమీదే ఉండడం విశేషం.
టీం ఇండియాకు ఎంపికవడమే లక్ష్యం..
ఇండియన్ క్రికెట్ టీంకు ఎంపికవడమే తన ఆశయమని జహీర్ తెలిపాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ప్రధాన జట్లయిన చెన్నై, కేకేఆర్‌లు ట్రయల్స్ కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాయని.. ఈ ఏడాది అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
పల్లెటూరి ఎక్స్‌ప్రెస్
అతను విసిరిన బంతి వేగం బుల్లెట్‌తో పోటీ పడుతుంది... అవతల బ్యాటరెవరైనా సరే బంతి వెళ్లి నేరుగా వికెట్లను ముద్దాడుతుంది..స్పీడొక్కటే కాదు.. ఇన్‌స్వింగ్‌తో బ్యాటర్‌ను బోల్తా కొట్టిస్తాడు.. అవుట్ స్వింగ్‌తో బెంబేలెత్తిస్తాడు.. అతడే అన్నమయ్య జిల్లాకు చెందిన స్పీడ్ స్టర్ .. ఏపీఎల్, ఐపీఎల్ క్రికెటర్ హరి శంకర్ రెడ్డి.
ఐదు సీజన్లలో ఏపీఎల్ ఆడిన హరి
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో హరిశంకర్‌రెడ్డి ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు. దాదాపు 40కి పైగా వికెట్లు సాధించారు. వరుసగా మూడుసార్లు బౌలింగ్ విభాగంలో టోర్నీలోనే అత్యధిక వికెట్లు సాధించి మొదటిస్థానంలో నిలబడుతూ వచ్చారు. అలాగే ఏపీ తరఫున ముస్తాక్ అలీ, విజయ్ హాజారే ట్రోఫీలో నూ సత్తాచాటాడు.
ఐపీఎల్‌లోనూ..
హరిశంకర్‌రెడ్డి ప్రతిభను గుర్తించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంఛైజీలు వేలంలో ఈ యువ క్రికెటర్‌ను దక్కించుకున్నారు. ప్రధానంగా చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టుకు ప్రాతినిద్యం వహించారు. ఈ సందర్భంగా టీం ఇండియా క్రికెటర్లతోపాటు ఇతర దేశాల క్రికెటర్లతో కలిసి బౌలింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు.


