ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్‌పై అశ్విన్ ఆగ్రహం
న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ ఐదో బంతికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సింగిల్ నిరాకరించడం తీవ్ర చర్చకు దారి తీసింది. మిల్లర్ తప్పు చేశాడని, జట్టు ఓటమికి కారణమయ్యాడని ఎక్కువ భాగం విమర్శలు వచ్చాయి. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు మిల్లర్ ఏం ఆలోచించాడో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తనకు అర్థం కావడం లేదని, మ్యాచ్ ఫలితాన్ని అసలు నమ్మలేకపోతున్నానని అతను వ్యాఖ్యానించాడు.
‘ఆఖరి బంతికి ఫోర్ లేదా సిక్స్ కొట్టాల్సి ఉందంటే మిల్లర్ నిర్ణయం సరైంది అనుకోవచ్చు. కానీ 2 బంతుల్లో 2 పరుగులు అంటే మహా అయితే ఏం జరిగే అవకాశం ఉంటుంది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే స్కోరు సమమయ్యేది. చివరి బంతికి కుల్దీప్ సింగిల్ తీసేవాడు. అలా కాకున్నా అతను అవుటయ్యేవాడు. అలాంటిది 10 మ్యాచ్‌లలో ఒకసారి జరగవచ్చంతే. భారీ స్కోర్ల మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లడంలో నష్టం ఏముంది. ఆ ఐదో బంతికి కుల్దీప్ స్థానంలో నేను ఉండి ఉంటే సింగిల్ కోసం దూసుకుపోయి అక్కడి నుంచి మిల్లర్‌ను పరుగెత్తమని తోసేసేవాడిని’ అని అశ్విన్ అన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు కొత్త తరహా దారులు వెతుకుతున్నట్లు అనిపిస్తుందని కూడా అశ్విన్ విశ్లేషించాడు. ‘ఈ తరహాలో ఓడిపోవడం వల్ల ముందుగా మీ జట్టులో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. పైగా వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడితే తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్న గుజరాత్ కోలుకొని మళ్లీ బరిలోకి నిలిచేందుకు మీరు అవకాశం కల్పించి మీరు నాలుగు పాయింట్ల వద్దే ఆగిపోయారు’ అని అశ్విన్ విమర్శించాడు.
మిల్లర్ ఆలోచన తప్పు కాదు: గావస్కర్
మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మాత్రం మిల్లర్ నిర్ణయాన్ని సమర్థించాడు. జట్టును గెలిపించాలనే అతని ఉద్దేశంలో తప్పేమీ లేదని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘మిల్లర్ అప్పటికి చాలా బాగా ఆడుతున్నాడు. గెలిపించగలనని తనపై తాను నమ్మకం ఉంచాడు. అతaని ఉద్దేశాన్ని మనం తప్పు పట్టవద్దు. చివరకు అతని ఆలోచన సరిగా అమలు చేయలేకపోయాడు.
ప్రసిధ్ కృష్ణ చక్కటి స్లో బౌన్సర్‌తో మిల్లర్‌ను కట్టిపడేశాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఈ స్థితిలోనే మన బుర్రను వాడాలి. నా ఉద్దేశం ప్రకారం కూడా ఐదో బంతికి సింగిల్ తీస్తే బాగుండేది. అంతకు ముందు కుల్దీప్ సింగిల్ రాబట్టగలిగాడనే విషయం మర్చిపోవద్దు’ అని గావస్కర్ అన్నాడు.


