మహిళల టీ20 ప్రపంచకప్-2026లో సౌతాఫ్రికా ప్లేయర్ మారిజాన్ కాప్ చరిత్ర సృష్టించింది. మాంచెస్టర్ వేదికగా భారత్‌తో నిన్న జరిగిన కీలక పోరులో 4 సిక్సర్లు బాదిన ఆమె.. సౌతాఫ్రికా తరఫున మహిళల టీ20 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మూడు సిక్సర్లతో క్లో ట్రయాన్, లిజెల్ లీ, లారా వోల్వార్డ్ట్ పేరిట ఉండేది.
కాప్ రికార్డు ప్రదర్శన కారణంగా భారత్‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్య ఛేదనలో ఆమె, 45 బంతుల్లో 4 సిక్సర్లతో పాటు 7 ఫోర్లు బాది అజేయమైన 81 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ గెలుపు సౌతాఫ్రికా ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది.
కాప్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు (81*) నమోదు చేసిన ప్లేయర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ జాబితాలో విండీస్ స్టెఫానీ టేలర్ 90 పరుగులతో అగ్రస్థానంలో ఉంది.
భారత్‌పై గెలుపు మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధికసార్లు 150కిపైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికాను నిలిపింది . ఇది వారి పదో విజయవంతమైన 150 ప్లస్ పరుగుల ఛేదన. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా (9) పేరిట ఉండేది.
కాప్ చేసిన అజేయ 81 పరుగులు మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. అలాగే ప్రపంచకప్‌లో భారత్‌పై నమోదైన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగానూ రికార్డుల్లోకెక్కింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన కాప్.. మహిళల టీ20 ప్రపంచకప్‌లలో 500కిపైగా పరుగులు, 30కిపైగా వికెట్లు సాధించిన నాలుగో క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది. ఈ జాబితాలో ఎల్లిస్ పెర్రీ, డియాండ్ర డాట్టిన్, స్టెఫానీ టేలర్ మాత్రమే కాప్ కంటే ముందున్నారు.
ఇక జట్టు రికార్డుల విషయానికి వస్తే, 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం దక్షిణాఫ్రికా మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదనగా నిలిచింది. అలాగే ప్రపంచకప్ చరిత్రలో మూడో అత్యధిక విజయవంతమైన ఛేజ్‌గానూ నమోదైంది.
ఈ మ్యాచ్‌లో కాప్ తజ్మిన్ బ్రిట్స్‌తో కలిసి మూడో వికెట్‌కు అజేయమైన 70 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ మూడో వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.


