జగజ్జేత ఆస్ట్రేలియా | Australia crush England to lift record-extending seventh title | Sakshi
Sakshi News home page

T20 WC 2026: జగజ్జేత ఆస్ట్రేలియా

Jul 5 2026 11:19 PM | Updated on Jul 6 2026 7:33 AM

Australia crush England to lift record-extending seventh title

ఏడోసారి మహిళల టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ సొంతం

ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 వికెట్లతో ఘనవిజయం

లండన్‌: ప్రతిష్టాత్మక మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అపజయం ఎరగకుండా ఫైనల్‌కు చేరిన ఆసీస్‌... తుదిపోరులోనూ అదే దూకుడు కనబర్చింది. ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో జరిగిన పూర్తి ఏకపక్ష ఫైనల్లో సోఫీ మోలినెక్స్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి ఏడోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీని హస్తగతం చేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటంగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ నాట్‌ సివర్‌ బ్రంట్‌ (53 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఫ్రెయా కెంప్‌ (28 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడింది. డానీ వ్యాట్‌ (8), అమీ జోన్స్‌ (6), హీతర్‌ నైట్‌ (2) విఫలమయ్యారు. ఆ్రస్టేలియా బౌలర్లలో కిమ్‌ గార్త్, లూసీ హామిల్టన్, సోఫీ మోలినెక్స్‌ , అనాబెల్‌ సదర్లాండ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా ఆడుతూ పాడుతూ గమ్యాన్ని చేరింది. 

ఆసీస్‌ 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జార్జియా వాల్‌ (9) రెండో ఓవర్‌లోనే అవుటైనా... బెత్‌ మూనీ (49 బంతుల్లో 64; 10 ఫోర్లు), లిచ్‌ఫీల్డ్‌ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 67 బంతుల్లోనే 100 పరుగులు జోడించి గెలుపుదిశగా నడిపించారు. బ్యాటింగ్‌లో ప్రభావం చేయలేకపోయిన ఇంగ్లండ్‌... బౌలింగ్‌లోనూ ఎలాంటి మ్యాజిక్‌ కనబర్చలేక నాలుగోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

బెత్‌ మూనీకే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’...‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డులు దక్కాయి. విజేత ఆస్ట్రేలియాకు 23 లక్షల 40 వేల డాలర్లు (రూ. 22 కోట్ల 34 లక్షలు)... రన్నరప్‌ ఇంగ్లండ్‌కు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.

7 మహిళల టి20 ప్రపంచకప్‌ ట్రోఫీ సాధించడం ఆస్ట్రేలియాకిది ఏడోసారి. 2010, 2012, 2013, 2018, 2020, 2023లో చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌... 2016 ఫైనల్లో ఓడింది.

4 మహిళల టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓడడం ఇంగ్లండ్‌కు ఇది నాలుగోసారి. ఆ నాలుగుసార్లు ప్రత్యర్థి ఆస్ట్రేలియానే కావడం గమనార్హం. 2009లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు... 2012, 2014, 2018 రన్నరప్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement