టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంకకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ తొడ కండరాల గాయం కారణంగా భారత్‌తో టెస్టు సిరీస్ నుంచి వైదొలగే పరిస్థితి ఏర్పడగా.. తాజాగా ఈ జాబితాలో మరో యువ బ్యాటర్ చేరాడు.
ఓపెనర్ పాథుమ్ నిస్సాంక మణికట్టు గాయం కారణంగా ఆగస్టు 15న ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. నిస్సాంక దీర్ఘకాలంగా వేధిస్తున్న మణికట్టుసమస్యను పరిష్కరించుకోవడానికి గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
ఈ క్రమంలోనే అతడు లంక ప్రీమియర్ లీగ్-2026కు దూరమయ్యాడు. అయితే భారత్‌తో టెస్టు సిరీస్ సమయానికి నిస్సాంక కోలుకుంటాడని లంక సెలక్టర్లు భావించారు. కానీ అతడి పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో తొలి టెస్టు కోసం జట్టు సెలక్షన్‌కు అతడు అందుబాటులో లేడు.
మరోసారి అతడికి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో నిస్సాంక ఉత్తీర్ణుడైతే రెండో టెస్టులో ఆడే అవకాశముంది. ఇక వీరిద్దరి స్ధానాలని భర్తీ చేసేందుకు నిషాన్ మధుష్క, పసిందు సూరియబండార, అంజలా బండార వంటి యువ ఆటగాళ్ల పేర్లను సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.
కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న వార్మాప్ మ్యాచ్‌లో నిషాన్ మధుష్క, రవిందు రసంత హాఫ్ సెంచరీలతో మెరిశారు. మధుష్కకు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. దాదాపుగా అతడినే నిస్సాంక స్ధానంలో జట్టులోకి తీసుకోవచ్చు. ఈ సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించలేదు.
చదవండి: అతడికి అసలైన పరీక్ష ఇక్కడే: శ్రీలంక మాజీ క్రికెటర్ వార్నింగ్


