మెస్సీని దాటేసిన ఎంబాపె.. ప్రిక్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్‌ | Kylian Mbappe World-Record-France Beat Sweden Enters Pre-Quarters FIFA WC | Sakshi
Sakshi News home page

మెస్సీని దాటేసిన ఎంబాపె.. ప్రిక్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్‌

Jul 1 2026 4:43 AM | Updated on Jul 1 2026 5:00 AM

Kylian Mbappe World-Record-France Beat Sweden Enters Pre-Quarters FIFA WC

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫ్రాన్స్ దూసుకుపోతోంది. టైటిల్ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న ఆ జ‌ట్టు రౌండ్ ఆఫ్ 32లో స్వీడ‌న్‌ను 3-0తో చిత్తు చేసింది. కైలియ‌న్ ఎంబాపె మ‌రోసారి డ‌బుల్ గోల్స్ (45, 74వ నిమిషం)తో మెర‌వ‌గా, బ్రాడ్‌లీ బార్కోలా (53వ నిమిషం) మ‌రో గోల్ సాధించాడు. ఫ్రాన్స్ దూకుడుకు స్వీడ‌న్ వ‌ద్ద స‌మాధానం లేకుండా పోయింది. మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఎక్కువ‌సేపు బంతిని త‌మ ఆధీనంలోనే ఉంచుకోవ‌డంతో స్వీడ‌న్‌కు గోల్‌పోస్టుపై దాడులు చేసే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గానే వ‌చ్చాయి. నిర్ణీత స‌మ‌యం ముగిసేలోపే ఫ్రాన్స్ విజ‌యం ఖ‌రారు అయిపోయింది. ఇక ప్రీ క్వార్టర్స్‌లో పరాగ్వేతో ఫ్రాన్స్‌ తలపడనుంది.

ఆమ‌డ‌దూరంలో మెస్సీ
ఫిఫా చ‌రిత్ర‌లో నాకౌట్ మ్యాచ్‌ల్లో కైలియ‌న్ ఎంబాపె స‌రికొత్త రికార్డు సృష్టించాడు.  మెస్సీకి కూడా సాధ్యం కాని రికార్డును ఎంబాపె త‌న పేరిట లిఖించుకున్నాడు. అదేంటంటే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాడిగా ఎంబాపె (10 గోల్స్‌) తొలి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బ్రెజిల్ దిగ్గ‌జ ఆట‌గాళ్లు లియోనిదాస్‌, రొనాల్డో ఫిఫా నాకౌట్ ద‌శ‌లో (8 గోల్స్‌) స‌మానంగా ఉన్నారు. 

వీరి త‌ర్వాత జ‌స్ట్ ఫౌంటైన్‌, వావా, ఒల్డ్‌రిచ్‌, పీలే (7 గోల్స్‌) ఉన్నారు. ఇక అర్జెంటీనా స్టార్ లియోన‌ల్ మెస్సీ (5 గోల్స్‌) 12వ స్థానంలో నిలిచి ఎంబాపెకు ఆమ‌డ దూరంలో నిలిచాడు. ఇక ఎంబాపె ఆడిన మూడు వ‌ర‌ల్డ్‌క‌ప్స్ (2018, 2022, 2026) నాకౌట్ ద‌శ‌లు క‌లిపి 10 గోల్స్ కొట్ట‌గా.. ఇందులో 2018లో నాకౌట్ ద‌శ‌లో మూడు గోల్స్‌, 2022 ఫిఫా నాకౌట్ ద‌శ‌ల్లో ఐదు గోల్స్‌, తాజాగా 2026 ఫిఫాలో నాకౌట్ ద‌శ‌లో ఇప్ప‌టికే రెండు గోల్స్ సాధించాడు. 

ఈ ప్ర‌పంచ‌క‌ప్ ముగిసేస‌రికి నాకౌట్ ద‌శ‌లో ఇంకెన్ని గోల్స్ చేస్తాడో చూడాలి. ఈ లెక్క‌న 27 ఏళ్ల ఎంబాపె వ‌చ్చే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ (2030) నాటికి ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిల‌వ‌డం ఖాయంగా కనిపిస్తోంది.

మెస్సీ రికార్డుకు అడుగు దూరంలో
ఇక ఫ్రాన్స్ సంచ‌ల‌నం కైలియ‌న్ ఎంబాపె రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే వ‌స్తున్నాడు. తాజాగా స్వీడ‌న్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయ‌డం ద్వారా ఎంబాపె (18 గోల్స్‌) ఫిఫాలో అత్య‌ధిక గోల్స్ చేసిన ఆల్‌టైమ్‌ ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో జ‌ర్మ‌నీ దిగ్గ‌జం మిరాస్లావ్ క్లోజ్ (16 గోల్స్‌) రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. 

ఇక అర్జెంటీనా స్టార్ లియోన‌ల్ మెస్సీ 19 గోల్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. మెస్సీ రికార్డును స‌మం చేయ‌డానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న ఎంబాపె అత్య‌ధిక గోల్స్ త‌న పేరిట లిఖించుకోవడానికి మాత్రం ప్ర‌స్తుతానికైతే రెండు గోల్స్ దూరంలో నిలిచాడు.  కేప్‌వెర్డెతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో మెస్సీ గోల్స్ చేస్తే మాత్రం ఎంబాపె ఆ రికార్డును అందుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. ఏది ఏమైనా ఎంబాపె మాత్రం మెస్సీ రికార్డును ఈ ఫిఫాలోనే అధిగమించే అవ‌కాశాలే ఎక్కువ‌గా కనిపిస్తున్నాయి.

ఫిఫాలో అత్య‌ధిక గోల్స్ జాబితా
లియోన‌ల్ మెస్సీ (అర్జెంటీనా)- 19 గోల్స్‌
కైలియ‌న్ ఎంబాపె (ఫ్రాన్స్‌)- 18 గోల్స్‌
మిరాస్లావ్ క్లోజ్ (జ‌ర్మ‌నీ)- 17 గోల్స్‌
రొనాల్డో (బ్రెజిల్)- 16 గోల్స్‌
గెర్డ్ ముల్ల‌ర్ (జ‌ర్మ‌నీ)- 14 గోల్స్‌
జ‌స్ట్ ఫౌంటైన్ (ఫ్రాన్స్‌)- 13 గోల్స్‌
పీలే  (బ్రెజిల్‌)- 12 గోల్స్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement