గురి తప్పని బాణం... | Kumkum Mohd wins gold in women's recurve event at Asian Games 2026 | Sakshi
Sakshi News home page

గురి తప్పని బాణం...

Oct 4 2026 4:02 AM | Updated on Oct 4 2026 4:02 AM

Kumkum Mohd wins gold in women's recurve event at Asian Games 2026

మహిళల ఆర్చరీ రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్‌ కుంకుమ్‌ మొహొద్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో మహిళల రికర్వ్‌ ఈవెంట్‌ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో ‘షూటాఫ్‌’ ద్వారా ఆమె విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా 6–5 స్కోరుతో యెజిన్‌ ఓ (దక్షిణ కొరియా)ను కుంకుమ్‌ ఓడించింది. ఐదు సెట్‌ల తర్వాత ఇద్దరు ఆర్చర్లు 5–5తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటాఫ్‌’ అవసరమైంది. 

ఈసారి భారత ఆర్చర్‌ సరిగ్గా 10 పాయింట్లు స్కోర్‌ చేయగా, కొరియా ఆర్చర్‌ 8 పాయింట్లకే పరిమితమై ఓటమిపాలైంది. అంతకుముందు కుంకుమ్‌ క్వార్టర్‌ ఫైనల్లో 6–4తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ కాంగ్‌ చెయంగ్‌ (దక్షిణ కొరియా)పై, సెమీఫైనల్లో 2025 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత జూ జింగీ (చైనా)పై విజయం సాధించింది. ఈ ప్రదర్శనతో కుంకుమ్‌ 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు నేరుగా బెర్త్‌ను అందించింది.

పురుషుల రికర్వ్‌ విభాగంలో భారత ఆటగాడు నీరజ్‌ 
చౌహాన్‌కు కాంస్య పతకం లభించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అతను మరో భారత ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్‌ బొమ్మదేవరను 6–4తో ఓడించడం విశేషం.

‘పసిడి కుంకుమ్‌’
17 ఏళ్ల కుంకుమ్‌ స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. చదువులో బాగా చురుకైన అమ్మాయి. ప్రతీసారి కనీసం 90 శాతం మార్కులు సాధిస్తూ వచ్చే ఆమెకు గణితం బాగా ఇష్టమైన సబ్జెక్ట్‌. కానీ ఇప్పుడు ఆమె దృష్టిలో అంకెలు అంటే లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత లెక్కించే స్కోరింగ్‌ పాయింట్లే!  2018లో తల్లి రూపాలి ప్రోత్సాహంతో తన 9 ఏళ్ల వయసులో ఆమె ఆర్చరీని మొదలు పెట్టి ఆపై ఒక్కో మెట్టే ఎక్కుతూ వచ్చింది. కోచ్‌ ప్రఫుల్‌ డాంగే చిన్నప్పుడు ఆమెలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా ఆటలో మేటిగా తీర్చిదిద్దాడు. ఇప్పటి వరకు కూడా ఆమె అక్కడే శిక్షణ కొనసాగిస్తోంది. 

2020లో జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో రాణించడంతో కుంకుమ్‌ అసలు ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 365 రోజులూ ఆమెకు ప్రాక్టీస్‌ చేయడంలోనే ఆనందం లభించేది. దసరా, దీపావళిలాంటి పండగలను కూడా ఏ రోజూ పట్టించుకోలేదు. కొన్నాళ్ల క్రితమే కోచ్‌ ఆమెను సోషల్‌ మీడియాకు దూరంగా ఉండమని చెప్పడంతో వెంటనే తన ఫోన్‌లోంచి యూట్యూబ్‌ను కూడా తొలగించి పూర్తిగా ఆర్చరీపైనే దృష్టి పెట్టింది. స్వీట్‌ షాప్‌లలో ఉపయోగించే బాక్స్‌లను ఇంట్లోనే తయారు చేసి సప్లై చేయడం ఆమె తండ్రి అనిల్‌ జీవనాధారం.

సహజంగానే క్రీడల కోసం ఎక్కువ మొత్తం కేటాయించే అవకాశం లేదు కాబట్టి ఇతర ప్రయత్నాలతోనే ఆమె కూతురుకు అండగా నిలిచాడు. ఇప్పుడు చిన్న వయసులోనే తన ఆటతో అరుదైన ఘనతలు సాధిస్తున్న కుంకుమ్‌ తండ్రి కళ్లల్లో ఆనందాన్ని నింపింది. ఆర్చరీని మొదలు పెట్టిన ఎనిమిదేళ్లలో ఆమె ఇప్పుడు భారత్‌ తరఫున అత్యుత్తమ ఆర్చర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో 2 స్వర్ణాలు సాధించడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 

ఇప్పుడు ఆసియా క్రీడలనుంచి 3 పతకాలతో వెనుదిరుగుతున్న కుంకుమ్‌ ఒలింపిక్స్‌ పతకాన్నే లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే ఇక్కడికి వచ్చాను. గత నెల రోజులుగా దీని కోసం చాలా కష్టపడ్డా. ఇప్పుడు దానిని అందుకోగలిగా. నాపై నాకు నమ్మకముంది. ఇతర సహచరులంతా కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. ఒలింపిక్స్‌పైనే నా గురి’ అని ఆమె వ్యాఖ్యానించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement