
నాగ్‌పూర్ వేదికగా ఇరానీ కప్ (Irani Cup 2025) మ్యాచ్‌పై విదర్భ జట్టు పట్టు బిగించింది. రెస్టాఫ్ ఇండియా (Vidarbha vs Rest of India)తో జరుగుతున్న ఈ పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం విదర్భ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
సెంచరీ హీరో ఈసారి ఫెయిల్
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో చాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టు... ఇరానీ కప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అథర్వ తైడె (15), అమన్ (37) అవుట్ కాగా... ధ్రువ్ షోరె (Dhruv Shorey- 60 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్), దానిశ్ మాలేవర్ (37 బంతుల్లో 16 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
లక్ష్యం ఎంతో?
రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, గుర్‌నూర్ బ్రార్ చెరో వికెట్ పడగొట్టారు. వర్షం కారణంగా మూడో రోజు కూడా ఆటకు ఆటంకం వాటిల్లింది. మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... 8 వికెట్లు చేతిలో ఉన్న విదర్భ జట్టు... ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి.
అంతకుముందు విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 69.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రజత్ పాటీదార్ (125 బంతుల్లో 66; 10 ఫోర్లు), అభిమన్యు ఈశ్వరన్ (112 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు.
రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1), మానవ్ సుతార్ (1) విఫలమవడంతో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు చేయలేకపోయింది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా... హర్ష్ దూబే, పార్థ్ చెరో 2 వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
విదర్భ తొలి ఇన్నింగ్స్: 342; రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: అభిమన్యు (ఎల్బీ) (బి) పార్థ్ 52; ఆర్యాన్ జుయెల్ (ఎల్బీ) (బి) దర్శన్ 23; యశ్ ధుల్ (స్టంప్డ్) వాడ్కర్ (బి) హర్శ్ దూబే 11; రజత్ పాటీదార్ (సి) రాథోడ్ (బి) హర్శ్ దూబే 66; రుతురాజ్ గైక్వాడ్ (సి) రాథోడ్ (బి) యశ్ ఠాకూర్ 9; ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) పార్థ్ 1; మానవ్ సుతార్ (ఎల్బీ) (బి) యశ్ ఠాకూక్ 10; ఆకాశ్‌దీప్ (సి) అథర్వ (బి) యశ్ ఠాకూర్ 14; అన్షుల్ కంబోజ్ (నాటౌట్) 10; గుర్‌నూర్ బ్రార్ (సి) దూబే (బి) యశ్ ఠాకూర్ 13; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (69.5 ఓవర్లలో ఆలౌట్) 214.
వికెట్ల పతనం: 1–52, 2–73, 3–105, 4–119, 5–124, 6–142, 7–175, 8–191, 9–191, 10–214. బౌలింగ్: హర్శ్ దూబే 22–5–58–2; ఆదిత్య ఠాకరే 11–1–40–1; దర్శన్ నల్కండే 8–1–26–1; యశ్ ఠాకూర్ 16.5–3–66–4; పార్థ్ రెఖడే 12–3–24–2.
విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ తైడె (సి) ఆకాశ్‌దీప్ (బి) మానవ్ సుతార్ 15; అమన్ (సి) ఇషాన్ కిషన్ (బి) గుర్‌నూర్ బ్రార్ 37; ధ్రువ్ షోరె (బ్యాటింగ్) 24; దానిశ్ మాలేవార్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (36 ఓవర్లలో 2 వికెట్లకు) 96.
వికెట్ల పతనం: 1–42, 2–64. బౌలింగ్: సారాంశ్ జైన్ 9–0–28–0; ఆకాశ్‌దీప్ 3–1–4–0; మానవ్ సుతార్ 14–1–35–1; అన్షుల్ కంబోజ్ 4–0–14–0; గుర్‌నూర్ బ్రార్ 6–2–11–1.
చదవండి: IND vs WI 1st Test: ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్..