భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు. భారీ అంచనాల నడుమ సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. గతేడాది ఐపీఎల్‌లో సంచలన సెంచరీతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)... ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో భారత అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు.
సెంచరీల మోత
ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో సెంచరీల మోత మోగించాడు. ఇటీవల ఆసియా అండర్-19 వన్డే కప్‌లోనూ రాణించిన వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుత ప్రదర్శనలకు గానూ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నాడు. ఇక అంతకు ముందే విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలో బిహార్ తరఫున వైస్ కెప్టెన్ హోదాలో భారీ శతకం బాదాడు.
తాత్కాలిక కెప్టెన్‌గా
అనంతరం సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో (IND U19 Vs SA U19) యూత్ వన్డేలతో వైభవ్ సూర్యవంశీ బిజీ అయ్యాడు. కొత్త ఏడాదిలోని ఈ తొలి టూర్‌లో భాగంగా భారత అండర్-19 జట్టు సౌతాఫ్రికా యువ జట్టుతో మూడు యూత్ వన్డేలు ఆడనుంది. తొలి మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ ఆయుశ్ మాత్రే దూరం కాగా.. వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
బెనోని వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత యువ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇటీవలి కాలంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతూ ఫామ్‌లో ఉన్న ఆరోన్ జార్జ్ (5) ఓపెనర్‌గా వచ్చి విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో.. తన దూకుడైన శైలికి భిన్నంగా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.
11 పరుగులు చేసి
అయితే, 12 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసిన వైభవ్.. జేజే బాసన్ బౌలింగ్‌లో లెథాబోకు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇలా వైభవ్ విఫలం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి వన్‌డౌన్‌లో వచ్చిన వేదాంత్ త్రివేది (21), వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (21) కూడా చేతులెత్తేశారు. ఈ క్రమంలో 15 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 68 పరుగులే చేసి కష్టాల్లో కూరుకుపోయింది.
చదవండి: టీ20 ప్రపంచకప్-2026: అభిషేక్ శర్మపై కూడా వేటు వేస్తారా?


