టీమిండియాను గడగడలాడించిన మూంద్రా.. ఐపీఎల్‌లో బిగ్‌ డీల్‌..! | IPL Teams Who May Break The Bank For Jai Moondra For 2027 Season | Sakshi
Sakshi News home page

టీమిండియాను గడగడలాడించిన మూంద్రా.. ఐపీఎల్‌లో బిగ్‌ డీల్‌..!

Jun 29 2026 12:43 PM | Updated on Jun 29 2026 12:49 PM

IPL Teams Who May Break The Bank For Jai Moondra For 2027 Season

ఐర్లాండ్ తరఫున సంచలన అరంగేట్రం చేసిన భారత సంతతి యువ పేసర్ జై మూంద్రా ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భారత్‌పై టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్న ఈ ఎడమచేతి ఫాస్ట్ బౌలర్.. 2027 ఐపీఎల్ మినీ వేలంలో హాట్ ప్రాపర్టీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజస్థాన్‌లోని టోంక్‌లో క్రికెట్ ఆడటం ప్రారంభించిన మూంద్రా.. ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అనంతరం ఐర్లాండ్ దేశవాళీ క్రికెట్‌లో రాణించి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. భారత్‌తో సిరీస్‌లో తొలి బంతికే వికెట్ తీసి ఆకట్టుకున్న అతడు.. మొత్తం సిరీస్‌లో భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

తొలి మ్యాచ్‌లో 25 పరుగులకు 2 వికెట్లు.. రెండో మ్యాచ్‌లో 32 పరుగులకు 3 వికెట్లు తీసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో మూంద్రాను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ వద్ద మూంద్రా సంధించిన బంతులు సమాధానం లేదు. 

రెండో మ్యాచ్‌లో మూంద్రా అభిషేక్‌, సంజూను వారెదుర్కొన్న తొలి బంతులకు ఔట్‌ చేసి హైలైటయ్యాడు. అనంతరం కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను మరో అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేసి ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు.

ఈ సంచలన ప్రదర్శనల తర్వాత మూంద్రాకు ఐపీఎల్‌లో భారీ గిరా​కీ ఏర్పడింది. అతడి కోసం మూడు టాప్‌ ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఆ ఫ్రాంచైజీ ఏవి.. మూంద్రాకు మినీ వేలంలో ఎంత ధర లభించవచ్చు తదితర అంశాలను పరిశీలిద్దాం. మూంద్రా కోసం ముందుగా ఎగబడే అవకాశాలు ఉన్న ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌.

ఈ ఫ్రాంచైజీ 2026 సీజన్‌లో బౌలింగ్ విభాగంలో ఆశించిన స్థాయి ప్రదర్శనలు చేయలేకపోయింది. దీంతో జట్టులోని విదేశీ పేసర్లలో మార్పులు చేసే అవకాశముంది. మార్కో యాన్సెన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, బెన్‌ డ్వార్షుయిస్‌, లోకీ ఫెర్గూసన్‌లలో ఎవరో ఒకరిని తప్పించి మూంద్రను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. శ్రేయస్‌ మూంద్రా ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో యాజమాన్యం ఆసక్తి చూపవచ్చు. పంజాబ్‌ మూంద్రా కోసం రూ. 5  కోట్లైనా వచ్చించే అవకాశం ఉంది.

కేకేఆర్‌
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో స్థిరత్వం లేక ఇబ్బందులు పడుతున్న కేకేఆర్‌కు జై మూంద్రా మంచి ఎంపికగా మారవచ్చు. మతీశ పతిరణ అందుబాటులో లేకపోవడం, బ్లెస్సింగ్‌ ముజరబానీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే మూంద్రా కోసం కేకేఆర్‌ ఎగబడే ఛాన్స్‌ ఉంది. కేకేఆర్‌ కూడా మూంద్రా కోసం ఇంచుమించు రూ. 5 కోట్లు ఖర్చు చేయవచ్చు.

Mumbai Indians
2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేస్‌ బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. బుమ్రా, దీపక్‌ చాహర్‌, బౌల్ట్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఆశించిన ప్రభావం చూపలేకపోవడంతో, జట్టు పునర్నిర్మాణంలో భాగంగా మూంద్రాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించడంలో పేరుగాంచిన ముంబై స్కౌటింగ్ వ్యవస్థకు జై మూంద్ర ఆకర్షణీయమైన ఎంపిక కావచ్చు. ఈ ఫ్రాంచైజీ మూంద్రా కోసం ఎంత ఖర్చు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement