ఐపీఎల్ ట్రోఫీ (PC: BCCI)
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026 Auction)- 2026 సీజన్ వేలం వరుసగా మూడో ఏడాది విదేశీ గడ్డపైనే జరగనుంది. తాజా సీజన్ వేలం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబి నగరాన్ని వేదికగా ఎంపిక చేశారు.
ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. కాగా 2023లో దుబాయ్, 2024లో జిద్దాలో ఐపీఎల్ లీగ్ వేలం నిర్వహించారు. అయితే, వేలంపాటకు సంబంధించిన తేదీ విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో వేలం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా పది ఫ్రాంఛైజీలు నవంబరు 15 నాటికి తాము అట్టిపెట్టుకునే, విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా ఐదేసి సార్లు ట్రోఫీ గెలవగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి చాంపియన్‌గా నిలిచాయి.
ఇక 2009లో డక్కన్ చార్జర్స్ టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడగా.. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ల కల ఇంకా తీరలేదు.
ఇదీ చదవండి: సరికొత్త చరిత్ర
జమ్మూ కశ్మీర్ జట్టు తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఘనతకెక్కే విజయాన్ని సాధించింది. గత 65 ఏళ్లుగా ఢిల్లీ చేతిలో ఇంటా బయటా ఓడిపోతూ వచ్చిన కశ్మీర్ ఇప్పుడు ఢిల్లీ గడ్డపై ఢిల్లీనే వణికించి గెలిచింది.
గ్రూప్ ‘డి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై జయభేరి మోగించింది. ఇది గాలివాటం గెలుపు కానేకాదు. మ్యాచ్ మొదలైన మొదటి రోజు నుంచి ఢిల్లీ బ్యాటర్లను జమ్మూ బౌలర్లు ఆకిబ్ నబీ (5/35), వంశజ్ (2/57), ముస్తాక్ (2/50) సమష్టిగా దెబ్బకొట్టారు.
తర్వాత బ్యాటింగ్‌లో కెప్టెన్ పారస్ డోగ్రా తొలి ఇన్నింగ్స్ శతకం, ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌ను వంశజ్ (6/68), సాహిల్ (3/73) ఇలా ప్రతి ఒక్కరు కశ్మీర్‌ను గెలిపించేందుకు ప్రతీ రోజు కష్టపడ్డారు. 1960 నుంచి ఇప్పటివరకు ఢిల్లీ, జమ్మూ కశీ్మర్ జట్లు 43 సార్లు తలపడితే ఇందులో 37 మ్యాచ్‌ల్లో ఢిల్లీదే గెలుపు. గత సీజన్ వరకు ఢిల్లీపై గెలుపన్నదే ఎరుగని కశీ్మర్ జట్టు ఎట్టకేలకు తాజా సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది.
ఇక్బాల్ అజేయ శతకం
మంగళవారం 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 55/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కశ్మీర్ 43.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (147 బంతుల్లో 133 నాటౌట్; 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతను బాదుతున్న బౌండరీలు, భారీ సిక్స్‌లతో విరుచుకుపడుతున్న వైనం చూస్తే ఇది నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ మ్యాచా లేదంటే వన్డేనా అన్న సందేహం కలుగకమానదు.
ఒంటిచేత్తో గెలిపించడం అంటే ఇదేనేమో అనిపించేలా దంచేశాడు. అవుటైన ముగ్గురు శుభమ్ (8), వివ్రంత్ శర్మ (3), వంశజ్ (8)లు చేసిందేమీ లేదు. ఇక్బాల్‌తో పాటు అజేయంగా నిలిచిన సారథి పారస్ డోగ్రా (10 నాటౌట్) పెద్ద స్కోరేం కాదు. ఈ నలుగురి కంటే కూడా ఎక్స్‌ట్రాల (17) రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం!..
ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘డి’లో 7 పాయింట్లతో ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలవకపోగా (రెండు డ్రా)... ఇప్పుడు కశ్మీర్ చేతిలో చిత్తుగా ఓడటంతో ఢిల్లీ నాకౌట్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది.
చదవండి: ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!.. మిగతా అందరూ ఉండాల్సిందే!


