IPL 2025: ఆర్సీబీ అభిమానులకు నిరాశ | IPL 2025 Winner RCB Open Bus Victory Parade Cancelled | Sakshi
Sakshi News home page

IPL 2025: ఆర్సీబీ అభిమానులకు నిరాశ

Jun 4 2025 3:04 PM | Updated on Jun 4 2025 4:22 PM

IPL 2025 Winner RCB Open Bus Victory Parade Cancelled

Photo Courtesy: BCCI

ఇండియన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో (ఐపీఎల్‌) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్‌ చేజిక్కించుకుంది. నిన్న (జూన్‌ 3) జరిగిన ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్‌ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. చివరి బంతి వరకు పోరాడింది. సీజన్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన పంజాబ్‌ టైటిల్‌ గెలవలేకపోయినా ప్రతి క్రికెట్‌ అభిమాని మనసును దోచుకుంది. యువ జట్టుతో శ్రేయస్‌ అయ్యర్‌ పంజాబ్‌ అద్భుతంగా నడిపించాడు. వ్యక్తిగతంగా రాణించడంతో పాటు జట్టుకు మంచి మార్గదర్శిగా నిలిచాడు. 

మరోవైపు సీజన్‌ ప్రారంభం నుంచి పంజాబ్‌తో పోటీపడిన ఆర్సీబీ ఫైనల్లో తమ అనుభవాన్నంత రంగరించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ అభిమానుల 17 ఏళ్ల కల నెరవేరింది. ప్రతి సీజన్‌లో ఆ జట్టు అభిమానులు ఈ సాలా కప్‌ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల 18వ ప్రయత్నంలో సాకారమైంది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ఆడుతున్న విరాట్‌ కోహ్లి కూడా ప్రతి సీజన్‌కు ముందు ఈ సాలా కప్‌ నమదే అనుకుంటూ బరిలోకి దిగేవాడు. ఎట్టకేలకు అతని కల కూడా ఈ సీజన్‌తో సాకారమైంది.

18వ ప్రయత్నంలో టైటిల్‌ గెలిచాక ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవథుల్లేవు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సాధించిన టైటిల్‌ కావడంతో ప్రతి అభిమాని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. టైటిల్‌ గెలిచాక ఆర్సీబీ అభిమానుల సంబురాలు అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అభిమానులు హడావుడి చేశారు. 

ఆర్సీబీ యాజమాన్యం ఈ రోజు బెంగళూరులో విజయోత్సవ ర్యాలీని ప్లాన్‌ చేసింది.  ఓపెన్‌ టాప్‌ బస్సులో విక్టరీ పరేడ్‌ నిర్వహించాలని అనుకుంది. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందన్న కారణంగా విక్టరీ పరేడ్‌ను అనుమతివ్వలేమని ఆర్సీబీ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. పోలీసుల నిర్ణయంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అయితే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సత్కార కార్యక్రమానికి మాత్రం అనుమతి లభించింది. అయితే ఇక్కడ కూడా పరిమితులతోనే కార్యక్రమం జరుపుకోవాలని సూచనలు అందాయి. టికెట్‌, పాస్‌ ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement