
ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టులో సత్తా చాటి.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- tendulkar Trophy) సిరీస్‌ను సమం చేసింది టీమిండియా. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండానే విదేశీ గడ్డ మీద సత్తా చాటింది. యువ నాయకుడు శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత్ తదుపరి ఆసియా కప్-2025 ఆడనుంది.
శుభవార్త.. ఓ చేదు వార్త కూడా..
ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నమెంట్‌కు ఆగష్టు చివరి వారంలో బీసీసీఐ (BCCI) జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ ఈవెంట్ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఒకే సమయంలో శుభవార్త.. ఓ చేదు వార్త అందాయి.
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు సర్జరీ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. అయితే, పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల పాటు విశ్రాంతి మాత్రం అవసరం అని చెప్పినట్లు తెలుస్తోంది.
విండీస్‌తో రెండు టెస్టులు
ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఆసియా కప్-2025తో పాటు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ సెప్టెంబరు 8- 28 వరకు జరుగనుండగా.. స్వదేశంలో విండీస్‌తో అక్టోబరు 2- 14 వరకు టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. అహ్మదాబాద్, ఢిల్లీ ఇందుకు వేదికలు
కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో రిషభ్ పంత్ అదరగొట్టాడు. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలు బాదిన ఈ లెఫ్టాండర్.. ఓవరాల్‌గా 479 పరుగులు సాధించాడు.
గాయంతోనే..
అయితే, మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌షాట్‌కు యత్నించిన పంత్.. విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి కుడికాలికి తగలగా పాదం ఉబ్బింది. అనంతరం బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయినా సరే.. పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
చదవండి: ప్రతోడు సచిన్, కోహ్లి అవుతారా?.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా పేసర్