source: X
భారత్, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. పుదుచ్చేరి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల తేడాతో ఘోర పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 48.2 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. నాథన్ మెక్‌స్వీని (123) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ విల్ సదర్‌ల్యాండ్ (77) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో సూర్యాంశ్ షేడ్గే 4, యశ్ ఠాకూర్ 3, అర్షద్ ఖాన్ 2, నిషాంత్ సంధు ఓ వికెట్‌తో సత్తా చాటారు.
పాటిదార్ పోరాడినా..
275 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కనీస పోరాటం చేయలేకపోయింది. ఆది నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ 31.4 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ బియర్ట్‌మన్ (4-23) టీమిండియాకు దారుణంగా దెబ్బకొట్టాడు. అతడికి స్పెన్సర్ జాన్సన్ (2-36), టాడ్ మర్ఫీ (1-18), మెక్‌స్వీని (1-14), మిచెల్ ఓవెన్ (1-13) తోడయ్యారు.
భారత్ తరఫున రజత్ పాటిదార్ (53) కాసేపు ఒంటరిపోరాటం చేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారత ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 1, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 17, పడిక్కల్ 0, కెప్టెన్ రుతురాజ్ 15, నిషాంత్ సంధు 31, సూర్యాంశ్ షేడ్గే 3, విప్రాజ్ నిగమ్ 13, అనుకూల్ రాయ్ 4, అర్షద్ ఖాన్ డకౌటయ్యారు. రెండో వన్డే ఇదే పుదుచ్చేరి వేదికగా అక్టోబర్ 9న జరుగనుంది.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ నెగ్గిన భారత్.. రెండో టెస్ట్‌ను డ్రా చేసుకుంది.
ఇదీ చదవండి: అరంగేట్రంలోనే చెలరేగిన నమన్ ధిర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?


