టి20ల్లో జోరు కొనసాగించేందుకు... | India first t20 match against Afghanistan today | Sakshi
Sakshi News home page

టి20ల్లో జోరు కొనసాగించేందుకు...

Sep 13 2026 12:38 AM | Updated on Sep 13 2026 12:38 AM

India first t20 match against Afghanistan today

నేడు అఫ్గానిస్తాన్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌

జోష్‌లో టీమిండియా 

సంచలనంపై అఫ్గాన్‌ దృష్టి 

సా.గం.7.30 సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌లలో ప్రసారం

ఒక వైపు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రాధాన్యత నేపథ్యంలో వరుసగా టెస్టు మ్యాచ్‌లు... ఏడాది కాలంలో వన్డే వరల్డ్‌ కప్‌ ఉండటంతో జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై వ్యూహాలు... వీటి మధ్య ఇప్పుడు కాస్త ఆటవిడుపుగా భారత జట్టు టి20 మ్యాచ్‌లకు సన్నద్ధమైంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టి20 సిరీస్‌లు ఆడి వచ్చిన భారత్‌ ఇప్పుడు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో పోరుకు సై అంటోంది. అయితే మూడు మ్యాచ్‌లకు వేదిక భారత రాజధాని అయినా... అధికారికంగా ఈ సిరీస్‌కు అఫ్గానిస్తాన్‌ బోర్డు ఆతిథ్యం ఇస్తోంది.  

న్యూఢిల్లీ: భారత్, అఫ్గానిస్తాన్‌ మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో తొలి పోరుకు రంగం సిద్ధమైంది. బలాబలాలను బట్టి చూస్తే ప్రత్యర్థికంటే భారత్‌ అన్ని విధాలా పటిష్టంగా ఉంది. కెప్టెన్‌గా రెండు సిరీస్‌లు కోల్పోయిన తర్వాత జింబాబ్వేతో సిరీస్‌ విజయాన్ని అందుకున్న శ్రేయస్‌ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. 

అన్నింటికి మించి హార్దిక్‌ పాండ్యా మినహా టీమిండియా రెగ్యులర్‌ ఆటగాళ్లతో పూర్తి స్థాయి జట్టుగా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా గాయంనుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న బుమ్రాపై అందరి దృష్టీ నిలిచింది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అప్పుడప్పుడు సంచలనాలతో సత్తా చాటిన అఫ్గాన్‌ టీమ్‌ ఇక్కడా తమదైన ముద్ర చూపించాలని పట్టుదలగా ఉంది. పలువురు ఐపీఎల్‌ ఆటగాళ్లు తమ జట్టులో ఉండటం కూడా అఫ్గాన్‌కు కొంత సానుకూలాంశం. ఈ సిరీస్‌లో ఆడుతున్న భారత జట్టే జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలకు కూడా వెళుతుంది.  

రెండో ఓపెనర్‌ ఎవరు? 
ఈ సిరీస్‌లో ఒకే ఒక ప్రశ్న ప్రస్తుతం టీమిండియా మేనేజ్‌మెంట్‌ ముందు నిలిచింది. అభిషేక్‌ శర్మతో పాటు రెండో ఓపెనర్‌గా సంజు సామ్సన్, వైభవ్‌ సూర్యవంశీలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్‌తో సామ్సన్‌ 2 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్‌ ఆడిన తర్వాత అతడిని తప్పించి వరుసగా మూడు మ్యాచ్‌లలో వైభవ్‌ను ఆడించారు. ఆపై చివరి మ్యాచ్‌కు మళ్లీ సామ్సన్‌ జట్టులోకి రాగా... జింబాబ్వేతో సామ్సన్‌ లేకపోవడంతో వైభవ్‌ మూడు మ్యాచ్‌లూ ఆడాడు.ఇప్పుడు ఇద్దరు అందుబాటులో ఉన్నారు.

దులీప్‌ ట్రోఫీలో చెలరేగిన ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ ఫార్మాట్‌కు తగినట్లుగా తమ బ్యాటింగ్‌ శైలిని మార్చుకొని చెలరేగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. బ్యాటింగ్‌పరంగా జింబాబ్వేలో ఆశించిన ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్‌ అయ్యర్‌ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. భారత్‌ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు రెగ్యులర్‌ పేసర్లతో బరిలోకి దిగనుండగా, పేస్‌ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌కుమార్‌ రెడ్డి అందుబాటులో ఉన్నాడు.  

రషీద్‌పై ఆశలు... 
భారత గడ్డపై ఆడటం అఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లకు కొత్త కాదు. ఇక్కడి పరిస్థితులపై వారికి మంచి అంచనా ఉంది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ ఐపీఎల్‌లో చూపించిన ప్రభావం అసాధారణం. వన్డేల్లో రషీద్‌ బౌలింగ్‌లో పదును కనిపించకపోయినా, టి20ల్లో అతను ఎప్పుడైనా ప్రమాదకారి. గుర్బాజ్, నబీ, అజ్మతుల్లా, ముజీబ్, నూర్, నవీన్, ఫారుఖీ వంటి ఐపీఎల్‌ ఆటగాళ్లతో జట్టు నిండి ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌పై ఉదాసీనత ప్రదర్శిస్తే టీమిండియాకు ఇబ్బంది ఎదురు కావచ్చు. కొత్త కెప్టెన్‌ ఇబ్రహీమ్‌ నాయకత్వంలో టీమ్‌ ఈ సిరీస్‌కు సిద్ధమైంది.

9 భారత్, అఫ్గానిస్తాన్‌ మధ్య 9 టి20లు జరగ్గా... భారత్‌ 7 గెలిచింది. ఒక మ్యాచ్‌ ‘టై’ కాగా, మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. అఫ్గాన్‌ ఇప్పటి వరకు ఓడించని పెద్ద జట్లు భారత్‌ మాత్రమే.

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: శ్రేయస్‌ (కెప్టెన్‌), అభిషేక్, సామ్సన్‌/ వైభవ్, ఇషాన్‌ కిషన్, తిలక్, అక్షర్, సుందర్, నితీశ్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్‌. 
అఫ్గానిస్తాన్‌: ఇబ్రహీమ్‌ (కెప్టెన్‌), గుర్బాజ్, నైబ్, సాదిఖుల్లా, రసూలీ, అజ్మతుల్లా, నబీ, రషీద్, ముజీబ్, నూర్, ఫారూఖీ/ నవీన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement