
టీమిండియా (PC: BCCI)
South Africa vs India, 2nd T20I: సౌతాఫ్రికా గడ్డపై పొట్టి ఫార్మాట్లో ఆధిపత్యం చాటేందుకు సిద్ధమైన టీమిండియాకు వరుణుడు అడ్డుపడుతున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వర్షం కారణంగా తొలి టీ20 రద్దైన విషయం తెలిసిందే. డర్బన్‌లో టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్ ముగిసిపోవడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు.
భారీ వర్షం కురిసే అవకాశం
ఈ క్రమంలో సెయింట్ జార్జ్ పార్కులో మంగళవారం జరగాల్సిన రెండో టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉన్నట్లు సమాచారం. రెండో టీ20కి వేదికైన పోర్ట్ ఎలిజబెత్ పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సిటీ మొత్తం మేఘావృతమై ఉందని.. ఒక్కసారి వాన మొదలైతే తెరిపినిచ్చే అవకాశం కూడా లేదని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పోర్ట్ ఎలిజబెత్‌లో ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు సమాచారం.
జడ్డూ, గిల్, సిరాజ్ ఎంట్రీ
ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, పేసర్ మహ్మద్ సిరాజ్‌లు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా జట్టుతో చేరారు. వీరి రాకతో యువ ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ గిల్ కారణంగా తుదిజట్టులో చోటు కోల్పోనున్నాడు.
టీమిండియాదే పైచేయి
ఇక టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు సఫారీల టీమిండియాదే పైచేయి. టీ20లలో భారత్- సౌతాఫ్రికా ఇరవై ఐదుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో 13 సార్లు టీమిండియా గెలవగా... ప్రొటిస్ జట్టుకు పదిసార్లు విజయం దక్కింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
కాగా పోర్ట్ ఎలిజబెత్‌లో మంగళవారం రాత్రి గం.8:30 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది. టీవీలో ‘స్టార్ స్పోర్ట్స్–1’ చానెల్‌లో.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే, ఇదంతా వరణుడు కరుణిస్తేనేనండోయ్!!
సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా రెండో టీ20 తుది జట్ల అంచనా:
టీమిండియా:
యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
సౌతాఫ్రికా:
రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ.
చదవండి: IPL 2024 Auction: కళ్లన్నీ అతడిపైనే.. బరిలో ఉన్న తెలుగు క్రికెటర్లు వీరే! భరత్‌తో పాటు..
Durban 🛫 Gqeberha 🛬#TeamIndia have arrived ahead of the 2nd T20I.#SAvIND pic.twitter.com/wjsP2vAq6U
— BCCI (@BCCI) December 11, 2023