PC: ICC
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో ఇంగ్లండ్ గ్రూప్-‘బి’ నుంచి పోటీలో ఉంది. ఇందులో భాగంగా తొలుత టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకను 87 పరుగుల తేడాతో చిత్తు చేసి బోణీ కొట్టింది ఆతిథ్య జట్టు.
హ్యాట్రిక్ విజయాలు
అనంతరం ఐర్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన నాట్ సీవర్ బృందం.. ఆ తర్వాత స్కాట్లాండ్ మహిళా జట్టుపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో ఇంగ్లండ్ 38 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది.
డానీ వ్యాట్ అర్ధశతకం
లండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో మొదట ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డానీ వ్యాట్ (42 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధశతకంతో రాణించింది. మిగిలిన వారిలో హీథర్ నైట్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించింది.
విండీస్ బౌలర్లలో అష్మిని మునిసార్ రెండు వికెట్లు తీయగా.. చినెల్లి హెన్రీ, కెప్టెన్ హేలీ మాథ్యూస్, కరిష్మా రామ్‌హరాక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులకు పరిమితమైంది.
లోయర్ ఆర్డర్‌లో చినెల్లి హెన్రీ మెరుపు అర్ధ శతకం (30 బంతుల్లో 51 నాటౌట్)తో ఆకట్టుకుంది. మిగిలిన వాళ్లంతా చేతులెత్తేయడంతో వెస్టిండీస్ ఓటమి ఖరారైంది.
నాలుగింట నాలుగూ గెలిచి
ఇంగ్లండ్ బౌలర్లలో సారథిగా వ్యవహరించిన చార్లెట్ డీన్ రెండు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, లిన్సీ స్మిత్, సోఫీ ఎక్లిస్టోన్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక వెస్టిండీస్‌తో విజయంతో లీగ్ దశలో ఇప్పటికి నాలుగింట నాలుగూ గెలిచిన ఇంగ్లండ్.. గ్రూప్-బి నుంచి అధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా అనధికారికంగా సెమీస్ చేరగా.. భారత్, సౌతాఫ్రికా రేసులో ఉన్నాయి.


