భారత మహిళల జట్టు.. తమ 47 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్లో ఆదివారం సౌతాఫ్రికాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది.
అయితే ఈసారి మనం మహిళల క్రికెట్‌లో సరికొత్త వరల్డ్ ఛాంపియన్ చూడబోతున్నాము. ఎందుకంటే, భారత్ కానీ, దక్షిణాఫ్రికా కానీ ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేదు. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా ముచ్చటగా మూడోసారి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే సెమీస్‌లో భారత అమ్మాయిల జట్టు రికార్డు విజయం సాధించినప్పటికి.. ఫైనల్‌కు ముందు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి.

ఫీల్డింగ్ మారుతుందా?
ఈ మెగా టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ పరంగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి.. ఫీల్డింగ్, బౌలింగ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తోంది. భారత జట్టు ఫీల్డింగ్ మ్యాచ్‌కు మ్యాచ్‌కు దిగజారుతోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటివరకు 18 క్యాచ్‌లు జారవిడిచింది. అత్యధిక క్యాచ్‌లు విడిచిపెట్టిన జాబితాలో హర్మన్ సేన అగ్రస్దానంలో నిలిచింది.
ఆసీస్‌తో సెమీస్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సైతం సునాయస క్యాచ్‌ను జారవిడించింది. మిస్‌ఫీల్డ్స్, ఓవర్ త్రోల రూపంలో మన అమ్మాయిల జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంటుంది. ఈ ఈవెంట్‌లో ఇప్పుటివరకు భారత్ మొత్తం 74 మిస్‌ఫీల్డ్స్ (అన్ని జట్లలో అత్యధికం) చేశారు. 6 ఓవర్‌త్రోలు కూడా ఉన్నాయి. సెమీస్‌లో మిస్‌ఫీల్డ్స్, ఓవర్ త్రోల ద్వారానే భారత్ 22 అదనపు పరుగులు ఇచ్చింది. కనీసం ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మెరుగైన ఫీల్డింగ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

డెత్ బౌలింగ్ కష్టాలు..
బౌలింగ్ విభాగంలో కూడా భారత్ చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లో ఒక్క శ్రీ చరణి మినహా మిగితా బౌలర్లంతా తేలిపోయారు. ఆఖరికి దీప్తి శర్మ వంటి స్టార్ స్పిన్నర్ సైతం భారీగా పరుగులు సమర్పించుకుంది.
రేణుకా సింగ్ వంటి స్టార్ పేసర్ జట్టులో ఉన్నప్పటికి ఆరంభంలో పిచ్ స్వింగ్‌కు అనుకూలించకపోతే ఆమె ఒక సాధారణ బౌలర్‌గా మారిపోతుంది. అంతేకాకుండా సెమీఫైనల్లో హర్లీన్ డియోల్ వంటి స్టార్ బ్యాటర్‌ను పక్కన పెట్టిమరి రాధా యాదవ్‌ను తీసుకొచ్చారు.
కానీ ఆమె కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. క్రాంతి గౌడ్ యువ ఫాస్ట్ బౌలర్ ఆడపదడప ప్రదర్శనలు చేస్తున్నప్పటికి.. ఫైనల్ వంటి హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఇక భారత జట్టులో డెత్ బౌలింగ్ లేమి స్పష్టంగా కన్పిస్తోంది.
భారత జట్టులో డెత్ ఓవర్లలో కట్టడి చేయగలిగే బౌలర్లే లేరు. రేణుకా గానీ, గౌడ్ గానీ డెత్ బౌలర్లు కాదు. దీప్తి శర్మపైనే అతిగా ఆధారపడటం ఒక పెద్ద సమస్యగా మారింది. లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ విషయం తేటతెల్లమైంది.

251 పరుగుల లక్ష్య చేధనలో సఫారీలు 81/5 తో కష్టాల్లో ఉన్నప్పటికీ.. భారత్ బౌలర్లు మాత్రం వారిని ఆలౌట్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆ మ్యాచ్‌లో భారత్ అనుహ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఫైనల్లో అదే సౌతాఫ్రికాపై మన బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్, ఫీల్డింగ్‌లో భారత్ మెరుగ్గా రాణిస్తే తొలి వరల్డ్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఖాయమనే చెప్పాలి.
ఇక బ్యాటింగ్‌లో యువ ఓపెనర్ షెఫాలీ వర్మ బ్యాట్ ఝూళిపించాల్సి ఉంది. రెగ్యూలర్ ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో షెఫాలీకి అవకాశం లభించింది. కానీ ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆమె కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటైంది.
అదేవిధంగా లీగ్ దశలో దుమ్ములేపిన స్మృతి మంధాన కీలకమైన ఫైనల్లో తన బ్యాట్‌కు పనిచెప్పాలి. ఆమె కూడా సెమీస్‌లో విఫలమైంది. మిడిలార్డర్‌లో రోడ్రిగ్స్, హర్మన్ వంటి ప్లేయర్లు మరోసారి చెలరేగాల్సిన అవసరముంది.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు


