అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) పరిధిని పెంచేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండంచెల విధానానికి స్వస్తి పలికి డబ్ల్యూటీసీ ఆడే జట్లను పెంచేందుకు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా 2019లో ఐసీసీ తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశపెట్టింది. రెండేళ్ల వ్యవధిలో ఆడే మ్యాచ్‌లు, వాటి ఫలితాల ఆధారంగా జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో గెలిచిన జట్టుకు ఐసీసీ గద లభిస్తుంది.
విజేతలు వీరే
తొలి సీజన్‌లో భారత్- న్యూజిలాండ్ (2019-21) డబ్ల్యూటీసీ ఫైనల్ తలపడగా.. కేన్ విలియమ్సన్ బృందం విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లి సేన రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక రెండో సీజన్‌లో (2021-23)లోనూ టీమిండియా ఫైనల్ చేరగా.. ఈసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది.
తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్-2025లో ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా విజేతగా అవతరించింది. కాగా టెస్టు హోదా ఉన్న ఉన్న పన్నెండు జట్ల నుంచి తొమ్మిది జట్లు మాత్రమే ఇప్పటి వరకు డబ్ల్యూటీసీలో భాగమయ్యేవి. ఇందులో టాప్-8లో ఉన్న జట్లు టైటిల్ రేసులో ఉండేవి.
ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వేలను కూడా డబ్ల్యూటీసీలో చేర్చాలనే ఉద్దేశంతో ఐసీసీ.. తొలుత రెండంచెల విధానాన్ని ప్రతిపాదించింది. ఒక అంచె నుంచి భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో ఓ జట్టు.. మిగిలిన జట్లను రెండో అంచెలో చేర్చాలని యోచించింది.
తీవ్ర వ్యతిరేకత
అయితే, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు వెస్టిండీస్ బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఇంగ్లండ్ సైతం టూ-టైర్ సిస్టమ్‌ను వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో దుబాయ్ వేదికగా తాజా ఐసీసీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది.
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..
ఆ వివరాల ప్రకారం.. రెండంచెల వ్యవస్థ యోచనను ఐసీసీ విరమించుకుంది. ఇందుకు బదులుగా డబ్ల్యూటీసీలోని జట్ల సంఖ్యను తొమ్మిది నుంచి పన్నెండు పెంచాలని నిర్ణయించింది. అంటే.. వచ్చే సీజన్ (2027-29) నుంచి అఫ్గనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు కూడా డబ్ల్యూటీసీలో చేరతాయి.
ఈ మూడూ టెస్టు హోదా పొందినప్పటికీ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ సైకిల్‌లో లేవన్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఐసీసీ బోర్డు డైరెక్టర్ ఒకరు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క జట్టు సంతృప్త స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది.
కానీ ఓ ట్విస్ట్
సంప్రదాయ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం’’ అని పేర్కొన్నారు. కాగా టెస్టు మ్యాచ్ నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పని. అయితే, చిన్న జట్లకు డబ్ల్యూటీసీ ఆడే అవకాశం ఇచ్చినా.. ఆర్థికంగా భరోసా ఇచ్చే అంశంపై ఐసీసీ
స్పష్టతనివ్వలేదు.
ఐర్లాండ్ వంటి పేద బోర్డులపై దీని ప్రభావం గట్టిగానే పడుతుంది. ఇప్పటికే ఖర్చును భరించే స్థోమత లేక సౌతాఫ్రికా, న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ల నిర్వహణకు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే.
చదవండి: భారత జట్టులో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటు.. కారణం ఇదే


