మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్‌ను 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. 462 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కరేబియన్ జట్టు చతికల పడింది. దీంతో మూడు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ ఫలితంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విజయంతో కివీస్ జట్టు పాయింట్ల పట్టికలో భారత్, దక్షిణాఫ్రికా లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుత సైకిల్‌లో న్యూజిలాండ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించగా.. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కివీస్ ఖాతాలో ప్రస్తుతం 28 పాయింట్ల ఉండగా.. పీసీటీ మాత్రం 77.78గా ఉంది.
టాప్‌లో ఆస్ట్రేలియా..
డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27 ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. అడిలైడ్ వేదికగా జరిగిన యాషెస్ మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్.. పాయింట్ల పట్టికలో తమ అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుత సైకిల్‌లో ఆసీస్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది.
కంగారుల ఖాతాలో 72 పాయింట్లు ఉండగా.. పీసీటీ మాత్రం వంద శాతంగా ఉంది. సౌతాఫ్రికా మూడో స్ధానంలో ఉండగా.. శ్రీలంక, పాకిస్తాన్ తర్వాత స్ధానాల్లో ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ ఓటమి చవిచూసిన టీమిండియా 48.15 శాతంతో ఆరో స్థానానికి పడిపోయింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ (16.67%), వెస్టిండీస్ (4.17%) చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: ఇన్నాళ్లు దాగున్న రహస్యం: తండ్రైన టీమిండియా క్రికెటర్


