న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఈ ఘతన సాధించారు.
టెస్ట్ క్రికెట్‌లోనే కాదు, యావత్ ఫస్ట్‌క్లాస్ చరిత్రలోనే ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా కాన్వే, లాథమ్ చరిత్ర సృష్టించారు.
ఈ మ్యాచ్‌లో లాథమ్ తొలి ఇన్నింగ్స్‌లో 137, రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేయగా.. కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (227), రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా కాన్వే మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ద్విశతకం, శతకం సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవాప్తంగా ఈ ఫీట్‌ను మరో తొమ్మిది మంది మాత్రమే సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. 462 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ 37, జాన్ క్యాంప్‌బెల్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవాలంటే మరో 419 పరుగులు చేయాలి.
అంతకుముందు కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను 306/2 వద్ద డిక్లేర్ చేసింది. కాన్వే, లాథమ్ శతక్కొట్టారు. దీనికి ముందు విండీస్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్‌బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 575 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాన్వే డబుల్ సెంచరీ, లాథమ్ సెంచరీ చేయగా.. రచిన్ రవీంద్ర (72 నాటౌట్) రాణించాడు.


