
శ్రీలంకతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గెలుపొందడం పట్ల టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టి కృషి, పట్టుదల కారణంగానే విజయం సొంతమైందని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. ఫైనల్ మాదిరి ప్రతి ఒక్కరు పట్టువదలకుండా పోరాడిన తీరు అద్భుతమంటూ కొనియాడాడు.
ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నమెంట్లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తొలుత పాకిస్తాన్‌ను... ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నామమాత్రపు సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడింది.
నువ్వా- నేనా
అయితే, ఇప్పటి వరకు పెద్దగా కష్టపడకుండానే ఈ టోర్నీలో మ్యాచ్‌లు గెలిచిన సూర్యకుమార్ సేనకు.. శ్రీలంక జట్టు చెమటలు పట్టించింది. నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీగా పోటీనిచ్చింది. 202 పరుగుల భారీ స్కోరు సాధించినా.. ధీటుగా బదులిచ్చి లంక మ్యాచ్‌ను టై చేసింది.
అర్ష్‌దీప్ సింగ్ చేతికి బంతి
ఈ క్రమంలో సూపర్ ఓవర్ అనివార్యం కాగా.. ఈసారి భారత్ తమ సత్తా చూపించింది. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేతికి సూర్య బంతిని ఇవ్వగా.. అతడు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. లంకను రెండు పరుగులకే పరిమితం చేసి.. రెండు వికెట్లు తీశాడు. అనంతరం సూర్య బ్యాట్‌తో రంగంలోకి దిగి తొలి బంతికే మూడు పరుగులు రాబట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ నేపథ్యంలో లంకపై గెలిచిన అనంతరం మీడియాతో సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘నాకైతే ఇదే ఫైనల్ మ్యాచ్‌లా అనిపించింది. మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో మా వాళ్లు అద్భుత పోరాటపటిమ కనబరిచి టై వరకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అదే జోరు కొనసాగించి మేము గెలిచాము.
సంజూ, తిలక్ సూపర్
సంజూ, తిలక్ వర్మ బ్యాటింగ్ చేసిన తీరు కనువిందు చేసింది. సంజూ ఓపెనర్‌గా రాగలడు. మిడిలార్డర్‌లోనూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగలడు. తిలక్ కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది.
ఇక అర్ష్‌దీప్ సింగ్.. గత రెండు- మూడేళ్లుగా జట్టుకు ఎంతో చేశాడు. ఈరోజు కూడా తన ప్రణాళికలకు కట్టుబడి ఉండి.. తనకు నచ్చినట్లుగానే వాటిని అమలు చేయమని చెప్పాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో (సూపర్ ఓవర్) అతడు అద్భుతం చేశాడు.
అతడికే ఇది సాధ్యం
గతంలో కూడా టీమిండియా తరఫున, ఐపీఎల్‌లోనూ ఇదే చేశాడు. అతడి ఆత్మవిశ్వాసమే బంతి రూపంలో ఇలా మాట్లాడుతుంది. అర్ష్‌దీప్ తప్ప ఈ సూపర్ ఓవర్ ఎవరూ ఇంత చక్కగా వేయలేరు’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు.
Arshdeep '𝘊𝘭𝘶𝘵𝘤𝘩' Singh 🔝🔥#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/GnOq4conhn
— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025
కాగా లంకతో మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) మరోసారి విజృంభించగా.. సంజూ శాంసన్ (23 బంతులో 39), తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్), అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్) రాణించాడు. ఇక పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్‌లో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
చదవండి: Asia Cup 2025: పాక్‌తో ఫైనల్‌కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు
1 ball is all it took! 😎
Surya Kumar Yadav seals an epic super over win for India 👏#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/H1z9GQQWDO— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025