ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను ‘డ్రా’ చేయడంలో కీలకపాత్ర పోషించిన భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు స్వదేశంలో మరో పటిష్ట జట్టుపై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో మన టీమ్ పైచేయి సాధిస్తుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘వరల్ట్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లపరంగా మనకు ఇది చాలా కీలక సిరీస్.
పైగా దక్షిణాఫ్రికా చాంపియన్ కూడా. ఆ జట్టు ఇటీవల పాక్‌పై సిరీస్ 1–1తో ‘డ్రా’ చేసుకున్నది వాస్తవమే. అయితే మా జట్టు కూడా చాలా బలంగా ఉంది. ఇంగ్లండ్‌తో చాలా బాగా ఆడి ఇటీవల వెస్టిండీస్‌పై అలవోకగా గెలిచాం. ఈ ఫామ్ కారణంగా టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగి అంతా సానుకూల వాతావరణం ఉంది. వ్యక్తిగతంగా నా బౌలింగ్ మంచి లయతో సాగుతోంది.
కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నా. పెద్ద జట్లను ఎదుర్కొనేటప్పుడు మన లోపాలు ఏమిటో తెలిసి వాటిని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సిరాజ్ చెప్పాడు. భారత్ తరఫున 43 టెస్టులు ఆడిన సిరాజ్ 133 వికెట్లు పడగొట్టాడు.


