ఆర్‌పీఎల్ రెండో సీజన్ చాంపియన్ హైదరాబాద్ హీరోస్.. | Hyderabad Heroes are the champions of the second season of RPL | Sakshi
Sakshi News home page

ఆర్‌పీఎల్ రెండో సీజన్ చాంపియన్ హైదరాబాద్ హీరోస్..

Jun 28 2026 10:49 PM | Updated on Jun 28 2026 10:49 PM

Hyderabad Heroes are the champions of the second season of RPL

ఫైనల్లో ముంబైపై ఘన విజయం

ముంబై డ్రీమర్స్‌ను 41-17 స్కోరుతో చిత్తు చేసిన హోమ్ టీమ్

హైదరాబాద్‌కు రూ. 45 లక్షలు.. రన్నరప్ ముంబైకి రూ. 25 లక్షల ప్రైజ్ మనీ

ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ పవర్డ్ బై ఎవిడ్ రెండో సీజన్ టైటిల్‌ను హైదరాబాద్ హీరోస్ కైవసం చేసుకుంది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన  ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ హీరోస్ 41-17 స్కోరు తేడాతో ముంబై డ్రీమర్స్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా టోర్నమెంట్ ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రాంధి, ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, ప్రముఖ నటి మిస్ మృణాళ్ ఠాకూర్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ మిస్టర్ జి.బి.ఎస్. రాజు, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్, లీగ్ కమిషనర్ రాహుల్ బోస్ హాజరయ్యారు.

ప్రపంచ స్థాయి రగ్బీ ప్రదర్శనతో ఆకట్టుకున్న హైదరాబాద్ హీరోస్ జట్టు చాంపియన్‌షిప్ ట్రోఫీతో పాటు రూ. 45 లక్షల ప్రైజ్ మనీని దక్కించుకుంది. రన్నరప్‌గా నిలిచిన ముంబై డ్రీమర్స్ రూ. 25 లక్షల నగదు బహుమతిని పొందింది. అంతకుముందు జరిగిన మూడో స్థాన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో చెన్నై బుల్స్‌ను 22-19తో ఓడించిన బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుని రూ. 15 లక్షల ప్రైజ్ మనీని అందుకుంది. మహిళల పోటీల విజయవంతమైన ప్రారంభంతో లీగ్ ప్రస్థానంలో మరో మైలురాయి నమోదైంది.

ఈ సందర్భంగా రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్ మాట్లాడుతూ, “హెచ్‌ఎస్‌బీసీ ఆర్‌పీఎల్  గత ఏడాది లీగ్ కంటే అన్ని విధాలా పెద్దదిగా, మెరుగ్గా సాగింది. భారీ సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులు, మరింత మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు, ఆర్‌పీఎల్ మహిళల లీగ్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అభిమానుల భాగస్వామ్యం, ఎక్కువ స్పాన్సర్‌షిప్, బ్రాడ్‌కాస్ట్‌లో భారీ వ్యూయర్‌షిప్ లభించాయి. ఇంతకంటే ఏం కావాలి? ఈ అద్భుతమైన క్రీడపై ప్రేమను పెంచుకున్న ప్రతి భారతీయుడికి ధన్యవాదాలు." అని అన్నారు.

జీఎంఆర్ స్పోర్ట్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుజోయ్ గంగూలీ మాట్లాడుతూ"హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ పవర్డ్ బై ఎవిడ్ రెండో సీజన్ విజయవంతంగా ముగియడం ఇండియాలో కొత్త క్రీడా వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే మా సుదీర్ఘ దార్శనికతలో మరో ముఖ్యమైన అడుగు. ప్రపంచ స్థాయి లీగ్‌లు యువ ప్రతిభను ప్రేరేపించడం, క్షేత్రస్థాయి అభివృద్ధిని బలోపేతం చేయడం, అథ్లెట్లకు ఆకాంక్షాత్మక వేదికలను సృష్టించడం ద్వారా క్రీడా రంగాన్ని మార్చగలవని జీఎంఆర్ స్పోర్ట్స్‌లో మేము నమ్ముతున్నాము. ఈ సీజన్‌లో అభిమానుల నుండి వచ్చిన అద్భుతమైన స్పందన, మహిళల పోటీల విజయవంతమైన ప్రారంభం.. ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడల్లో ఒకటిగా మారడానికి రగ్బీకి అపారమైన సంభావ్యత ఉందనే మా నమ్మకాన్ని బలపరిచాయి." అని అన్నారు.

ఫైనల్ మ్యాచ్ సాగిందిలా.. 
ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ క్లినికల్ ప్రదర్శనతో ముంబై డ్రీమర్స్‌ను 41-17తో అధిగమించింది. మ్యాచ్ ప్రారంభంలో ముంబై జట్టు బంతిపై ఎక్కువ నియంత్రణ సాధించినప్పటికీ, దానిని పాయింట్లుగా మార్చడంలో విఫలమైంది. హైదరాబాద్ కట్టు దిట్టమైన డిఫెన్స్‌తో ముంబై నుంచి బంతిని లాక్కొని ఎదురుదాడికి దిగింది. ఫ్రాన్సిస్కో కాస్కుల్లోలా బంతిని దక్కించుకుని తైతైఫోనో తావితాకు అందించగా  అతను పాయింట్ సాధించాడు. ఆ తర్వాత మాన్యుయెల్ మోరెనో బంతిని పాస్ చేయగా శివమ్ శుక్లా సులువుగా ఫినిష్ చేశాడు. 

మారిస్ లాంగ్‌ బాటమ్ డ్రాప్ గోల్ కొట్టడంతో విరామ సమయానికే హైదరాబాద్ పూర్తి నియంత్రణ సాధించింది. విరామం తర్వాత కూడా హైదరాబాద్ హీరోస్ అదే వేగాన్ని కొనసాగించింది. తావితా లెఫ్ట్ సైడ్ కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకుని డీగో అర్డావో గోల్ కొట్టాడు. ముంబై ఆటగాడు ఇథన్ మెక్‌ఫార్లాండ్ వేగవంతమైన కదలికలతో ఒక గోల్ చేసి ముంబైకి బ్రేక్‌థ్రూ ఇచ్చాడు. అయినా హైదరాబాద్ తన దాడిని ఆపలేదు. 

అర్డావో తన రెండో గోల్ సాధించగా.. కెవిన్ వెకేసా అద్భుతమైన మూవ్‌తో మరో పాయింట్ కొట్టాడు. చివరి క్వార్టర్ ప్రారంభంలో టెరియో తమాని ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ముంబై జట్టులో జేమ్స్ టర్నర్ ఒక గోల్ తిప్పికొట్టడంతో పాటు చివర్లో సుకుమార్ హెంబ్రోమ్ గోల్ చేయడానికి అసిస్ట్ చేశాడు. అయినప్పటికీ హైదరాబాద్ క్లినికల్ ఫినిషింగ్, బలమైన డిఫెన్స్‌తో భారీ విజయాన్ని ఖరారు చేసుకుంది.

మూడో స్థానం ప్లే-ఆఫ్ మ్యాచ్ సాగిందిలా 
మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో బుల్స్ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. మరికా కొరోయిబెటె ఒక లూజ్ పాస్‌ను అడ్డుకుని, ముందుకు దూసుకెళ్లి, జుగల్ మాఝీ మొదటి ట్రై సాధించేలా బంతిని అందించాడు. అయితే బెంగళూరు జట్టు సంయమనంతో సమాధానమిచ్చింది. డిఫెన్స్‌లో దొరికిన ఖాళీని షిల్టన్ వైక్ ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ క్వార్టర్‌లో నిరంతర ఒత్తిడిని కొనసాగిస్తూ, జోనాస్ మికాల్సియస్ ఒక వింగ్ నుండి అలాగే గణేష్ మాఝీ మరో వింగ్ నుండి దాడి చేయడంతో బెంగళూరుకు మంచి ఆధిక్యం లభించింది.

విరామం తర్వాత చెన్నై పుంజుకుంది. మార్కస్ కెర్షా స్వల్ప దూరం నుండి ట్రైని పూర్తి చేయగా, ఆ తర్వాత ఫిలిపే సౌతురాగా ప్రత్యర్థి త్రోను అడ్డుకుని బుల్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయినప్పటికీ, మ్యాచ్ ముగింపు దశలో బ్రేవ్‌హార్ట్స్ ఓపికగా బంతిని వైడ్‌గా పాస్ చేస్తూ ముందుకు సాగింది. అక్కడ అకుయిలా రొకోలిసోవా లైన్‌ను దాటి జట్టుకు ఒక నాటకీయ విజయాన్ని అందించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement