అగార్కర్‌తో గంభీర్ (PC: BCCI X)
టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ ప్రయాణం ముగిసిపోయింది. సెలక్షన్ కమిటీలో అతడి స్థానం ఖాళీ అయిన విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం అధికారికంగా ధ్రువీకరించింది. అగార్కర్ స్థానంలో కొత్త సెలక్టర్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
జట్టు ముఖ్యం..
ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అగార్కర్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘ప్రియమైన అజిత్ భాయ్.. నీతో కలిసి పని చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం నీ నిర్ణయాలకు దక్కిన ఫలితం.
జట్టు ముఖ్యం.. అన్నింటికంటే ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలే అంతిమ లక్ష్యం. ఈ చరిత్ర నీ పట్ల దయ కలిగి ఉంటుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. నీ సేవలకు ధన్యవాదాలు. నీ భవిష్యత్తు బంగారంలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని గంభీర్ ఉద్వేగపూరిత పోస్టు పెట్టాడు.
ఆ మూడు ఐసీసీ ట్రోఫీలు
కాగా 2023లో అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అగార్కర్ హయాంలో.. భారత జట్టు తొలుత 2024 టీ20 ప్రపంచకప్ ట్రోఫీ గెలిచింది.
ఇక అగార్కర్- గంభీర్ కాంబినేషన్‌లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, వీరిద్దరు భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విషయంలో కఠినంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి.
రో-కో పట్ల కఠిన వైఖరి
ముఖ్యంగా రో-కో టెస్టుల నుంచి తప్పుకోవడంలో అగార్కర్ కీలక పాత్ర పోషించాడని.. వారు రిటైర్మెంట్ ప్రకటించేలా కఠిన పరిస్థితులు కల్పించాడనే ఆరోపణలు వచ్చాయి. వన్డేల్లో వీరిద్దరు కొనసాగుతామని స్పష్టం చేసినప్పటికీ.. వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడతామని రో-కో స్పష్టత ఇవ్వలేదంటూ అగార్కర్ బహిరంగంగా ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణం.
అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు ఇవ్వడంలోనూ అగార్కర్‌దే కీలక పాత్ర అని సమాచారం. ఇందుకు గంభీర్ కూడా సహకరించాడనే వదంతులు వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ అగార్కర్ పదవీ కాలాన్ని పొడిగించకుండా అతడికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గంభీర్ మాత్రం ఇటీవల రో-కోలను ప్రశంసిస్తూ ఇద్దరినీ ఆకాశానికెత్తాడు.
నన్ను ఇరికించి.. నువ్వు పొగుడుతావా?
ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్.. గంభీర్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘రోహిత్- కోహ్లిలను గంభీర్ పొగడటం చూసి.. అగార్కర్ కచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటాడు.
‘ఇద్దరం కలిసే కదా.. ఆ ఇద్దరిని తప్పించాలని చూశాము. ఆ ప్రయత్నంలో నేను నా పదవిని పోగొట్టుకున్నాను. నువ్వు మాత్రం నన్ను ఇరికించి ఇప్పుడిలా వాళ్లను ప్రశంసిస్తావా?’ అని అగార్కర్ గంభీర్‌ను మనసులో బాగా తిట్టుకుని ఉంటాడు’’ అని సదోగపన్ రమేశ్ సెటైర్లు వేశాడు.
ఈ క్రమంలో గంభీర్ తాజాగా అగార్కర్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లే భారత్ ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిందని పోస్ట్ పెట్టడం గమనార్హం. తద్వారా అగార్కర్ నిర్ణయాలతో తాను ఏకీభవిస్తానని.. రో-కో విషయంలో గంభీర్ నిర్ణయం మారదని.. కేవలం బీసీసీఐ పెద్దల భయానికే వారి విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: నా కల నెరవేరింది.. అతడొక అద్భుతం
Dear Ajit Bhai, an absolute honour to work with you. Those 3 ICC trophies are testimony of your conviction: Team first & Team ahead, always.. I must say, History will be kinder to you. Thank you for everything. My heartfelt wishes for your future endeavours !! https://t.co/gYQN0fea8X
— Gautam Gambhir (@GautamGambhir) October 7, 2026


