సెలక్షన్ కమిటీ సమావేశం (PC: BCCI X)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా సెలక్షన్ కమిటీలో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పదవిలో భాగంగా పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా.. టెస్టు, వన్డే, టీ20లు.. ఇతర ఫార్మాట్లకు జట్లను ఎంపిక చేయాల్సి ఉంటుందని తెలిపింది.
అంతేగాక.. సీనియర్ టీమ్ కోసం మెరికల్లాంటి, ప్రతిభ గల యువ ఆటగాళ్ల వెదుకులాటలోనూ సమర్థవంతంగా పనిచేసే సభ్యుడి కోసం ఎదురుచూస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. తద్వారా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీ కాలం అధికారికంగా ముగిసిందని బీసీసీఐ పరోక్షంగా స్పష్టం చేసింది.
కాగా 2023లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టాడు. అతడి హయాంలో భారత్ రెండు టీ20 ప్రపంచకప్ ట్రోఫీలు, ఒక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ ట్రోఫీ.. తాజాగా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచింది.
అయితే, సీనియర్లు, మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విషయంలో అగార్కర్ వ్యవహార శైలి బీసీసీఐ పెద్దలకు నచ్చలేదని.. అందుకే అతడికి ఉద్వాసన పలకాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే అగార్కర్ పదవీ కాలాన్ని మరింత పొడిగించకుండానే బోర్డు అతడికి వీడ్కోలు పలికింది.
ఇక అగార్కర్ స్థానంలో ప్రస్తుతం.. మరో మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడే పూర్తి స్థాయిలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యే అవకాశం కూడా ఉంది.
మెన్స్ సెలక్షన్ కమిటీ సభ్యుడి బాధ్యతలు ఇవే
👉న్యాయబద్ధంగా.. పారదర్శక పద్ధతిలో సీనియర్ జాతీయ పురుషుల జట్టుకు అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయాలి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లతో పాటు బెంచ్ బలాన్ని పటిష్టం చేసే విధంగా ఎంపికలు ఉండాలి.
👉అన్ని ఫార్మాట్లకు తగినట్లుగా స్కౌటింగ్ చేయాలి.
👉టీమ్ సమావేశాలకు హాజరు కావాలి. అవసరమైతే దేశీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
👉త్రైమాసిక సమీక్షలో భాగంగా నివేదికలను అపెక్స్ కౌన్సిల్‌కు సమర్పించాలి.
👉జట్టు ఎంపికకు సంబంధించి మీడియాతో మాట్లాడాల్సి ఉంటుంది.
👉ప్రతీ ఫార్మాట్‌కు సంబంధించిన కెప్టెన్ నియామకంలోనూ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
అర్హతలు ఇవే.. అనుభవం ఉండాలి
టీమిండియా తరఫున కనీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడాలి. లేదంటే కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాలి. అదీ కాకుంటే పది వన్డే ఇంటర్నేషనల్స్‌తో పాటు 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
అదే విధంగా.. అన్ని ఫార్మాట్ల ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్ల కాలం గడిచి ఉండాలి. ప్రస్తుతం ఖాళీ ఉన్న సెలక్టర్ పదవి కోసం అక్టోబరు 14, 2026 సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తు సమర్పించాలి.
చదవండి: నాశనం చేస్తున్నారు: గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ ఫైర్


