హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం | Henry Nicholls Century New Zealand-352-Runs-Lead Vs ENG 2nd Test | Sakshi
Sakshi News home page

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

Jun 20 2026 7:39 AM | Updated on Jun 20 2026 11:32 AM

Henry Nicholls Century New Zealand-352-Runs-Lead Vs ENG 2nd Test

ఇంగ్లండ్‌తో జ‌రిగిన‌ తొలి టెస్టు నుంచి ఓట‌మి పాఠాలు నేర్చుకున్న న్యూజిలాండ్ రెండో టెస్టులో మాత్రం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఓవ‌ల్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశ‌గా సాగుతుంది. మూడోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ 56 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 252 ప‌రుగులు చేసింది. 

హెన్రీ నికోల్స్ (164 బంతుల్లో 119 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ సెంచ‌రీ సాధించ‌గా, డారిల్ మిచెల్ (32 బ్యాటింగ్‌) అత‌డికి స‌హ‌క‌రిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం క‌లుపుకొని న్యూజిలాండ్ ఇప్ప‌టివ‌ర‌కు 352 ప‌రుగుల భారీ ఆధిక్యం సాధించింది. మ‌రో రెండు రోజుల ఆట మిగిలి ఉండ‌డంతో కివీస్ విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. 

అంత‌క‌ముందు ఇంగ్లండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 291 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓపెన‌ర్ ఎమిలియో గే (53), డెబ్యూ ఆట‌గాడు మాథ్యూ ఫిష‌ర్ (50 నాటౌట్‌) అర్థ‌సెంచ‌రీలు చేయ‌గా, కెప్టెన్ రూట్ (46) ప‌ర్వాలేద‌నిపించాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ 5 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, విలియ‌మ్ రూర్కీ 2, కైల్ జేమీస‌న్‌, నాథ‌న్ స్మిత్ చెరొక వికెట్ తీశారు. 

దీంతో తొలుత మాట్‌ హెన్రీ తన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ బ్యాటర్లను చెడుగుడు ఆడుకుంటే.. ఆ తర్వాత మరో హెన్రీ (హెన్రీ నికోల్స్‌) ఇంగ్లండ్‌ బౌలర్ల భరతం పట్టి సెంచరీతో మెరిశాడు. ఈ లెక్కన ఇద్దరు హెన్రీల (మాట్‌ హెన్రీ, హెన్రీ నికోల్స్‌) చేతుల్లో ఇంగ్లండ్‌ చావుదెబ్బ తిన్నట్లయింది. 

ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే. గ్లెన్ ఫిలిప్స్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు వంద ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. తొలి టెస్టులో న్యూజిలాండ్‌ 115 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

 

 

 Read: ఫిఫా చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్‌ గోల్‌.. మొరాకోదే విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement