త్వరలో సౌతాఫ్రికాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (India vs South Africa) ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్‌లకు సన్నాహకంగా నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు.ఈ టోర్నీలో హార్దిక్ తన హోం టీమ్ బరోడా తరఫున బరిలోకి దిగుతాడు.
హర్దిక్ చివరిగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాంపిటేటివ్ క్రికెట్ ఆడాడు. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన అతను.. ఆతర్వాత పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యాడు. హార్దిక్ ఇటీవలే గాయం (ఎడమ క్వాడ్రిసెప్స్) నుంచి పూర్తిగా కోలుకొని, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
ఫిట్‌నెస్ టెస్ట్‌లన్నీ క్లియర్ చేసి అధికారిక అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. నవంబర్ 26న బెంగాల్‌తో జరిగే మ్యాచ్‌తో రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ రెండు మ్యాచ్‌లకు (28న జరిగే మ్యాచ్‌కు కూడా) మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఆ తర్వాత అతను భారత జట్టుతో కలవాల్సి ఉంటుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌కు హార్దిక్ తప్పక ఎంపికయ్యే అవకాశం ఉంది. రాంచీ వేదికగా తొలి వన్డే జరుగనుంది. డిసెంబర్ 3న రాయ్‌పూర్, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మిగిలిన రెండు వన్డేలు జరగనున్నాయి.
ఆ తర్వాత సౌతాఫ్రికాతోనే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కటక్ వేదికగా డిసెంబర్ 9న ప్రారంభవుతుంది. ఈ సిరీస్‌లో కూడా హార్దిక్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్టే. హార్దిక్ జట్టులో చేరితే భారత మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది. హార్దిక్ గైర్హాజరీలో భారత్ ఆసియా కప్ ఫైనల్లో గెలిచి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.
ఆతర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?


