టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముంబై నుంచి అతడు మకాం మార్చేశాడు. ‘శాశ్వతం’గా బెంగళూరులో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. హార్దిక్ పాండ్యా సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
వెన్నునొప్పి కారణంగా..
కాగా అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా.. చాన్నాళ్ల క్రితమే టెస్టు ఫార్మాట్‌ను వదిలేశాడు. వన్డే, టీ20లలో టీమిండియా కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న ఈ బరోడా ఆటగాడిని తరచూ గాయాలు వేధిస్తున్నాయి. ఒకానొక దశలో వెన్నునొప్పి కారణంగా ఏళ్ల పాటు జట్టుకు దూరమైన అతడు.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
భారత్ టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కొన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా తరచూ గాయాల బారిన పడుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్-2026లో పలు మ్యాచ్‌లకు దూరమైన ఈ ఆల్‌రౌండర్.. తాజాగా తొడ కండరాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు.
శాశ్వత శిక్షణా శిబిరం అక్కడే!
ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE- Centre of Excellence)లో హార్దిక్ పాండ్యా పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో CoEనే తన శాశ్వత శిక్షణా శిబిరంగా మార్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ముంబై నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది.
ఈ విషయం గురించి హార్దిక్ పాండ్యా సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ ఇప్పటికే శాశ్వతంగా బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయాడు. సిటీ శివార్లలో ఓ ప్రాపర్టీని అద్దెకు తీసుకున్నాడు. CoEకి అది అతి దగ్గరగా ఉంటుంది. CoEనే శాశ్వత ట్రెయినింగ్ సెంటర్‌గా మార్చుకున్న తొలి భారత క్రికెటర్ ఇతడేనేమో!
అందుకే ముంబై నుంచి బెంగళూరుకు షిఫ్ట్
తన కెరీర్ చరమాంకం వరకు అతడు ఇక్కడే శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి ముంబైలో తన ఇంటి నుంచి.. ట్రెయినింగ్ సెంటర్‌కు వెళ్లడం హార్దిక్‌కు చాలా కష్టంగా మారింది. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న క్రికెటర్‌గా CoEలో అతడికి అన్ని సౌకర్యాలూ లభిస్తాయి.
గాయం నుంచి కోలుకోవడం నుంచి.. నైపుణ్యాలు మెరుగుపెట్టుకోవడం సహా ప్రతీ విషయంలోనూ అతడికి బీసీసీఐ నుంచి సహకారం ఉంటుంది. అందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్, దేశీ టోర్నీలు, టీమిండియా తరఫున విధుల్లో ఉన్నపుడు మాత్రం అతడు CoEకి దూరంగా జట్టుతో కలిసి ఉంటాడు.
మరో ఐదు నుంచి ఆరేళ్ల పాటు హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ కెరీర్ సజావుగా కొనసాగించాలనుకుంటున్నాడు. అందుకోసం తనను తాను మెరుగుపరచుకోవడం అత్యవసరం’’ అని పేర్కొన్నాయి. కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వ్యక్తిగత సెలవులో ఉన్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకునే క్రమంలో త్వరలోనే CoEకి అతడు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తిప్పికొట్టిన శ్రేయస్


