PC: X
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్-2026లో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ అదరగొట్టాడు. తొలుత జూలై 28న జరిగిన 10,000 మీటర్ల విభాగంలో రజతం (సిల్వర్) గెలుచుకున్న గుల్వీర్.. తాజాగా శనివారం 5000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
రేసును గుల్వీర్ 13 నిమిషాల 24.95 సెకన్లలో ముగించి ఈ బ్రాంజ్ మెడల్‌ను ఒడిసి పట్టాడు. తద్వారా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే 5000 మీటర్ల పరుగు పందెంలో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుల్వీర్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్ ఒకే ఎడిషన్‌లో భారత్ తరపున రెండు పతకాలు సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా కూడా అతడు చరిత్ర సృష్టించాడు.
గుల్వీర్ సింగ్ ట్రాక్ రికార్డ్
28 ఏళ్ల గుల్వీర్ సింగ్ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 5000 మీటర్లు (12:59.77), 10,000 మీటర్లు రెండింటిలోనూ జాతీయ రికార్డులు కలిగి ఉన్నాడు. అంతకుముందు చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడలు-2023లోనూ అతడు 10,000 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్‌లో నాయిబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు.


