‘డెకా’లో తేజస్విన్‌ కేక | Tejaswin Shankar wins bronze in decathlon making history at Commonwealth Games | Sakshi
Sakshi News home page

‘డెకా’లో తేజస్విన్‌ కేక

Aug 2 2026 3:58 AM | Updated on Aug 2 2026 3:58 AM

Tejaswin Shankar wins bronze in decathlon making history at Commonwealth Games

కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో డెకాథ్లాన్‌ పోటీల్లో పతకం గెలుచుకున్న తొలి భారత అథ్లెట్‌గా తేజస్విన్‌ శంకర్‌ గుర్తింపు పొందాడు. శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో అతను కాంస్య పతకంతో సత్తా చాటాడు. పది వేర్వేరు ఈవెంట్ల సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ ఓవరాల్‌గా 7976 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. లిండన్‌ విక్టర్‌ (గ్రెనడా – 8096) స్వర్ణం గెలుచుకోగా, డామియాన్‌ వార్నర్‌ (కెనడా – 8036)కు కాంస్యం లభించింది. 

2022 కామన్వెల్త్‌ క్రీడల హైజంప్‌లో కాంస్యం సాధించిన తేజస్విన్‌...ఈ పోటీల రెండు వేర్వేరు క్రీడాంశాల్లో పతకం నెగ్గిన తొలి భారతీయుడిగా కూడా ఘనత సాధించాడు. తాజా పోటీల హైజంప్‌ ఈవెంట్‌లో తొలి ప్రయత్నంలో విఫలమైన తర్వాత తేజస్విన్‌ బరినుంచి తప్పుకున్నాడు. సుదీర్ఘకాలంగా తనను ఇబ్బంది పెడుతున్న మోకాలి గాయం తిరగబెట్టడమే అందుకు కారణం.

కన్నీళ్లతో ఫీల్డ్‌ను వీడిన తేజస్విన్‌ ఇప్పుడు డెకాథ్లాన్‌లో విజయం అనంతరం తన భావోద్వేగాన్ని ప్రదర్శించాడు. డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ వరుసగా 100 మీ. (870 పాయింట్లు), లాంగ్‌ జంప్‌ (1015), షాట్‌పుట్‌ (673), హైజంప్‌ (944), 400 మీ. (837), 110 మీ. హర్డిల్స్‌ (922), డిస్కస్‌ త్రో (674), పోల్‌వాల్ట్‌ (702), జావెలిన్‌ (635), 1500 మీ.(704) చొప్పున పాయింట్లు నమోదు చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement