అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్‌?.. చిక్కుల్లో కెప్టెన్‌?! | Gill Act In Edgbaston Test Worries Fans Is It Land BCCI In Trouble | Sakshi
Sakshi News home page

నువ్విపుడు కెప్టెన్‌వి.. ఇలా ఎందుకు చేశావు గిల్‌?.. చిక్కుల్లో బీసీసీఐ?!

Jul 7 2025 10:51 AM | Updated on Jul 7 2025 11:43 AM

Gill Act In Edgbaston Test Worries Fans Is It Land BCCI In Trouble

PC: X

భారత టెస్టు క్రికెట్‌లో ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సాధించాడు. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో తొలిసారి టీమిండియాకు టెస్టు విజయాన్ని అందించాడు. బ్యాటర్‌గానూ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని.. సారథిగా రెండో ప్రయత్నంలోనే చిరస్మరణీయ గెలుపుతో సత్తా చాటాడు.

చారిత్రాత్మక విజయంతోనే సమాధానం
ఈ నేపథ్యంలో 25 ఏళ్ల శుబ్‌మన్‌ గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెప్టెన్‌గా ఇతడేంటి? అన్న వాళ్లకు చారిత్రాత్మక విజయంతోనే సమాధానమిచ్చాడంటూ మాజీ క్రికెటర్లు ఈ కుర్రాడిని కొనియాడుతున్నారు. అయితే, అంతా బాగానే ఉన్నా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే సమయంలో గిల్‌ వ్యవహరించిన తీరు అతడిని చిక్కుల్లో పడేసేలా ఉంది.

చిక్కుల్లో పడేలా గిల్‌ చర్య?
టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌ ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో టెస్టు ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269)తో చెలరేగిన గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌ (161)లోనూ శతక్కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో తాను అవుటైన కాసేపటికే గిల్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ ప్రకటన చేశాడు.

డ్రెసింగ్‌రూమ్‌ బయటకు వచ్చి అప్పటికి క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా (69*), వాషింగ్టన్‌ సుందర్‌ (12*)లను వెనక్కి రావాల్సిందిగా గిల్‌ రెండు చేతులతో సైగ చేశాడు. అయితే, ఈ సందర్భంగా అతడు తన జెర్సీ తీసేసి.. బ్లాక్‌ వెస్ట్‌ (లో దుస్తులు)తో దర్శనమిచ్చాడు. అది నైక్‌ బ్రాండ్‌కు చెందినది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు గిల్‌ తీరును విమర్శిస్తూ అతడితో పాటు బీసీసీఐ కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..

బీసీసీఐ అధికారిక కిట్‌ స్పాన్సర్‌ అడిడాస్‌ అన్న విషయం తెలిసిందే. ఇందుకు గానూ భారత పురుషుల జట్టు జెర్సీలు, కిట్లు రూపొందించేందుకు బీసీసీఐతో భారీ మొత్తానికి అడిడాస్‌ 2023లో ఐదేళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 

అయితే, ఆ బ్రాండ్‌కు కాంపిటీటర్‌ అయిన మరో బ్రాండ్‌ వెస్ట్‌ ధరించి గిల్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడం.. అది విశేషంగా వైరల్‌ కావడంతో చట్టపరంగా బోర్డుకు, అతడికి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. 

మరి కొందరేమో ఓ అడుగు ముందుకేసి.. ‘‘నువ్వు ఇప్పుడు కెప్టెన్‌వి. ఆచితూచి అడుగేయాలి. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు’’ అంటూ గిల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య జూలై 10 -14 మధ్య లార్డ్స్‌లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

టీమిండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు
🏏టీమిండియా- 587 & 427/6 d
🏏ఇంగ్లండ్‌- 407 & 271
🏏ఫలితం- ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 
🏏తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకుని.. సిరీస్‌ 1-1తో సిరీస్‌ సమం
🏏ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌- శుబ్‌మన్‌ గిల్‌.

చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్‌ గిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement