
టీమిండియాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ (Sandeep Patil) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవతరం ఆటగాళ్లంతా పనిభారం అంటూ సాకులు చూపడం సరికాదని విమర్శించాడు. ఆధునిక క్రికెట్‌లో కెప్టెన్, హెడ్‌కోచ్ కంటే ఫిజియోలకే ఎక్కువ ప్రాముఖ్యం దక్కుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను గిల్ సేన 2-2తో సమంగా ముగించింది.
బుమ్రా మూడే ఆడాడు
అయితే, ఈ సిరీస్‌లో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా.. అతడిని కేవలం మూడు టెస్టుల్లోనే ఆడించారు. పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా కీలక సమయంలో.. కీలక మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. సిరీస్ డ్రా అయింది కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే బుమ్రాతో పాటు మేనేజ్‌మెంట్‌పై విమర్శల దాడి మరింత ఎక్కువయ్యేది.
ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అతడే డిసైడ్ చేస్తాడా?
‘‘అసలు బీసీసీఐ ఇలాంటి వాటికి ఎలా అంగీకరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. కెప్టెన్, హెడ్‌కోచ్ కంటే వీరికి ఫిజియోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయ్యేలా ఉన్నాడు. అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు?
సెలక్షన్ కమిటీ సమావేశాల్లో వీరితో కలిసి ఫిజియో కూడా కూర్చుంటాడా ఏమిటి?. ఎవరి వర్క్‌లోడ్ ఎంత? ఎవరు ఆడాలని అతడే డిసైడ్ చేస్తాడా?’’ అని 1983 వన్డే వరల్డ్‌కప్ విన్నర్ సందీప్ పాటిల్ అసహనం వ్యక్తం చేశాడు.
పనికిమాలిన వ్యవహారం
అదే విధంగా.. ‘‘వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అనేదే ఓ పనికిమాలిన వ్యవహారం. ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారా? లేదంటే అన్‌ఫిట్?.. ఈ రెండిటి ఆధారంగానే జట్ల ఎంపిక ఉండాలి. అంతేగానీ.. ఈ వర్క్‌లోడ్ బిజినెస్‌ను పట్టించుకోకూడదు.
మా రోజుల్లో అయితే ఫ్యాన్సీ స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించినా సునిల్ గావస్కర్ తిట్టేవాడు. అయితే, రోజులు మారాయి. కానీ ఈ నవతరం క్రికెటర్లు తరచూ మ్యాచ్‌లు మిస్ కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా’’ అని సందీప్ పాటిల్ మిడ్-డేతో పేర్కొన్నాడు.
చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్